మిల్లర్ల చేతిలో పౌర సరఫరాల శాఖ కీలుబొమ్మ.. స్కామ్ వెనుక ‘పెద్దలు’ : వైసీపీ సర్కార్‌పై నాదెండ్ల ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ.200 చొప్పున దోచుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు నాదెండ్ల . రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు పట్టని వ్యక్తి సీఎంగా ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారని మనోహర్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాం.. ఆఫ్రికా కూడా ఆదర్శంగా తీసుకుంటోందని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వరి రైతుల బాధలకు ఏం సమాధానం చెబుతారని నాదెండ్ల ప్రశ్నించారు.
రైతులకు భరోసా ఇవ్వని కేంద్రాలు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అని ఆయన నిలదీశారు. ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళ్ళిన రైతులకు ఎదురౌతున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయని నాదెండ్ల తెలిపారు. దళారులకు నిలయాలుగా ఆర్బీకేలు మారిపోయాయని.. రైస్ మిల్లర్లు రైతుల బాధలను ఆసరాగా చేసుకొని గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మనోహర్ ఆరోపించారు. రైతుల ఆధార్ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ చేస్తున్న మాయ వల్ల అన్నదాతలు మోసపోతున్నారని నాదెండ్ల మండిపడ్డారు. వేల మంది రైతుల చిరునామాలు గల్లంతు చేసి కుంభకోణానికి తెర తీశారని.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకొందని ఆయన ధ్వజమెత్తారు. ఇది ఒక సమస్యే కాదని ఉన్నతాధికారులు, మంత్రులతో చెప్పించడం ద్వారా ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలెవరో అర్థమవుతోందంటూ నాదెండ్ల మనోహర్ చురకలు వేశారు.
రైతుల నుంచి ధాన్యం సేకరించి సకాలంలో నగదు చెల్లించాల్సిన పౌరసరఫరాల శాఖ.. మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. దీని కారణంగా రైతులు నష్టపోతున్నారని.. వారికి గోనె సంచులు, రవాణా ఛార్జీలు ఇవ్వడం లేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతులే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరిస్తే.. సొమ్ములు ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో తొలకరి పంట సమయం మొదలవుతోందని.. అన్నదాతలకు పంట పెట్టుబడులు అవసరమవుతాయని నాదెండ్ల గుర్తుచేశారు. ధాన్యం అమ్మిన డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఎలా... ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మనోహర్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments