Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. టీడీపీ అభ్యర్థికి లైన్ క్లియర్..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్ రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. అయితే అక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో దుర్గేష్‌కు నిడదవోలును కేటాయించారు. కొంతకాలంగా ఈ సీటుపై సస్పెన్స్ నెలకొనడంతో రెండు పార్టీల క్యాడర్ అయోమయానికి గురైంది. తాజాగా నిడదవోలు నుంచి పోటీ చేయాలని దుర్గేష్‌ను జనసేన ఆదేశించడంతో బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది.
కాగా పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 24 సీట్లలో ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల లోకం మాధవి, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ పేర్లు ఉన్నాయి. దీంతో మొత్తం 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 18 సీట్లలో నేతలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో పవన్ కల్యాణ్ కూడా ఉండటం గమనార్హం.
తొలుత పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు స్థానిక టీడీపీ, బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోని పీఠాపురం నుంచి పోటీకి ఆయన మొగ్గు చూపినట్లు చర్చ జోరందుకుంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ పెద్దలు అక్కడి నుంచి కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి చేర్చుకుని పోటీ చేయించి పవన్‌కు చెక్ పెట్టాని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కూడా పవన్ పోటీ చేయడం లేదని వార్తలు ఊపందుకున్నాయి.
వైసీపీ వ్యూహాలకు చిక్కకుండా కావాలనే తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటనను ఆలస్యం చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆయన పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తుందంటున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా తిరుపతి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీగా కూడా బరిలో దిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments