ఉచిత విద్య, వైద్యం, ప్రయాణమే జనసేన లక్ష్యం

  • IndiaGlitz, [Friday,March 01 2019]

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యార్ధుల‌కి ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం, ఉచిత క్యాంటిన్లు అందుబాటులోకి తెస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం క‌డ‌ప న‌గ‌రంలోని శ్రీనివాస రెసిడెన్సీలో విద్యార్ధుల‌ ఇష్టా గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడి రైళ్ల‌లో కూడా ఉచిత ప్ర‌యాణానికి ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. అవ‌స‌రం అయితే అందుకోసం కేంద్రానికి కొంత మొత్తం చెల్లిస్తామ‌ని చెప్పారు. ఉచిత విద్య అందించే అంశంపై మాత్రం మ‌రో 15 రోజుల త‌ర్వాత స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని తెలిపారు. అంద‌రికీ ఉచితంగా విద్య, వైద్యం అందించాల‌న్న‌దే జ‌న‌సేన పార్టీ ల‌క్ష్యమన్నారు. ఆ దిశ‌గా తొలి ప్ర‌య‌త్నంగా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పౌష్టికాహారంతో కూడిన ఉచిత మెస్సులు, ఫ్రీ బ‌స్ పాస్‌లు ఇస్తామని జనసేనాని తెలిపారు. ఫీజుల‌కి సంబంధించి మాత్రం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉందన్నారు.

విద్యా వ్య‌వ‌స్థ‌ని సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న‌!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, అధికార పార్టీ నేత‌లు మాట్లాడితే ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్ అంటున్నారు. అస‌లు ఫీజులే తీసుకోకుంటే ఆ అవ‌స‌రం రాదు. కాలేజీల్లోనే విద్యార్ధుల‌కి భోజ‌నాలు పెట్టాలి. విదేశాల్లో విద్యార్ధుల‌కి సంబంధించి అన్ని సౌక‌ర్యాలు ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంది. ఇక్క‌డేమో కార్పొరేట్ కోసం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని చంపేస్తున్నారు. ఎడ్యుకేష‌న్ అంటే అదేదో ఓ బ్ర‌హ్మ విద్య అన్న చందంగా నాయ‌కులు భ‌య‌పెట్టారు. కాన్సెప్ట్యువ‌ల్ ఎడ్యుకేష‌న్‌ని దెబ్బ తీశారు. అలాంటి క్వాలిటీ విద్య‌ని అందిస్తే ఐన్‌స్టీన్ థియ‌రీ కూడా అర్ధం చేసుకోవ‌డం తేలిక‌. జ‌న‌సేన పార్టీ అలాంటి విద్యా విధానాన్ని తీసుకువ‌స్తుంది. బ‌ల‌మైన టీచ‌ర్ల వ్య‌వ‌స్థను తీసుకువ‌స్తే త‌ప్ప, బ‌ల‌మైన విద్యార్ధి వ్య‌వ‌స్థ త‌యారు కాదు. ఇప్పుడు ఉన్న విద్యా వ్య‌వ‌స్థ‌ని సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న‌ చేయాల్సి ఉంది. అది ఒక్క రోజులో సాధ్య‌ప‌డే విష‌యం కాదు. అందుకే మార్పుకి 25 ఏళ్ల స‌మ‌యం కావాలి అని అడుగుతున్నా. విద్య అంటే వ్యాపారం కాదు జ్ఞానం అని పవన్ చెప్పుకొచ్చారు.

జేపీని కొట్టారు!

రాజ‌కీయ పార్టీల‌కి ఆశ‌యాలు ఒక్క‌టే ఉంటే స‌రిపోవు. జేపీ లాంటి నాయ‌కుడు విలువ‌ల గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నేత ఒక‌రు కొట్టారు. ఆ త‌ర్వాత చాలా కామెంట్లు వ‌చ్చాయి. విలువ‌ల్ని బ‌తికించాలంటే మాట‌లు ఒక్క‌టే స‌రిపోవు. మ‌న ఆశ‌యాల్ని ముందుకి తీసుకువెళ్లే స‌మ‌యంలో దాడులు జ‌రిగితే దాన్ని ఎదుర్కోవ‌డానికి అవ‌స‌ర‌మైన మ‌జిల్ ప‌వ‌ర్ కూడా కావాలి. మ‌హాత్మా గాంధీ గారి చేతిలో కూడా క‌ర్ర ఉంటుంది. అయితే అది కొట్ట‌డానికి కాదు భ‌య‌పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. దేవ‌తా విగ్ర‌హాలకి సైతం ఆరు చేతులు ఉంటాయి. కేవ‌లం మంచి మాట్లాడితే స‌రిపోదు. మంచిని అమ‌లుప‌రిచేందుకు అవ‌స‌రం అయితే అంకుశం కూడా ప్ర‌యోగించాలన‌డానికి అవి నిద‌ర్శ‌నాలు అని పవన్ స్పష్టం చేశారు.

చేగువేరా అంటే అందుకే ఇష్టం

పూర్తి అహింసా ప‌ద్ద‌తిలో రాజ‌కీయం చేద్దామంటే క‌ష్టం. మార్పు అసాధ్యం. నేను చాలా ఆశ‌యాల‌తో పెరిగా. అంతా విలువ‌ల గురించి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతారు. అయితే అవి మ‌న‌కే గాని మాట్లాడే వారికి వ‌ర్తించ‌వు. రాయ‌ల‌సీమ‌లో అడుగుపెట్ట‌ని వారికి- ఆ ప్రాంతం పేరు చెబితే చెట్టు మొల‌వ‌దు... బాంబులు విసురుకుంటూ ఉంటారు అని మాత్ర‌మే తెలుసు. ఓ పీర్ బాబా, ఓ అన్న‌మ‌య్య‌, ఓ వెంగ‌మాంబ లాంటివారు పుట్టినగ‌డ్డ ఇది. విద్య‌లు ఉన్న నేల ఇది. చెగువేరా అంటే నాకు ఇష్టం. అది ఎందుకు అంటే దేశం కాని దేశం కోసం తాను పోరాటం చేశాడు. స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన ఆయ‌న స‌మాజానికి ప‌ట్టిన వ్యాధిని న‌యం చేసేందుకు విప్ల‌వ వీరుడ‌య్యారు. అందుకే చెగువేరా అంటే నాకు గౌర‌వం అని పవన్ స్పష్టం చేశారు.

నాకెవరూ చెప్పలేదు..

ఎన్నిక‌ల‌కి ముందు యుద్ధం వ‌స్తుంద‌ని రెండేళ్ల క్రిత‌మే తెలుసు అన్న మాట మీద చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. ముందే తెలుసు అంటే పాకిస్థాన్ వారు నాకు చెప్పార‌ని కాదు. దేశంలో ఉన్న ఆర్ధిక ప‌రిస్థితుల ఆధారంగా, నిఘా వ‌ర్గాలు ఇచ్చిన హెచ్చ‌రిక‌ల ఆధారంగా కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు రెండేళ్ల క్రిత‌మే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాన్నే నేను ప్ర‌స్తావించా. క‌డ‌ప అంటే ఒక కుటుంబం కాదు. ఇలాంటి ఈ ప‌రిస్థితి మారాలి. అలా జ‌ర‌గాలి అంటే గుండెల నిండా ధైర్యం కావాలి. గుండెల నిండా ధైర్యం అంటే గుండెలు చూప‌డం కాదు. ఆలోచ‌న‌తో ఇలాంటి కోట‌ల్ని బ‌ద్ద‌లు కొట్టాలిఅని పవన్ పిలుపునిచ్చారు.