ఎమ్మెల్యే రాపాకకు ఝలక్ ఇచ్చిన జనసైనికులు..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీకే ఝలక్ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీనిని మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ జనసైనికులు మాత్రం రాజోలులో గట్టి దెబ్బే కొట్టారు. నిజానికి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఆయన పలికిన పలుకులు జనసైనికుల గుండెల్లో బాగా నాటుకు పోయినట్టున్నాయి. అందుకే సమయం చూసి మరీ రివెంజ్ తీర్చుకున్నారు. నంబర్ 1 గానే ఉంటానని.. 152వ నంబర్ కాదల్చుకోలేదని చెప్పిన రాపాక.. మాట తప్పడానికి పెద్దగా సమయం పట్టలేదు. అంతేనా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. అవకాశం దొరికినప్పుడల్లా జనసేనపై మాటల తూటాలు పేలుస్తున్నారు.
తన సొంత క్రేజ్‌పై గెలిచినట్టు.. పార్టీ ఏదో తన కారణంగానే రాజోలులో నిలిచినట్టు భావిస్తూ వస్తున్నారు రాపాక. అందుకే యూటర్న్లు.. మాటల తూటాలు.. మొత్తానికి రాపాక జనసైనికులకు టార్గెట్‌గా మారిపోయారు. దీంతో పంచాయతీ ఎన్నికల రూపంలో జనసైనికులకు మంచి అవకాశం దొరికింది. ఈ ఎన్నికల ద్వారా ఎమ్మెల్యే రాపాక ఆధిపత్యానికి చెక్ పెట్టాలని జనసైనికులు భావించారట. ఇక్కడ జనసైనికుల లక్ష్యం వైసీపీని దెబ్బకొట్టడమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి మద్దతుగా జనసైనికులు నిలిచారని తెలుస్తోంది. అలాగే టీడీపీ కూడా కొన్ని గ్రామాల్లో జనసేనకు మద్దతుగా నిలిచినట్టు సమాచారం.
రాజోలు నియోజకవర్గంలో 60 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ 60 స్థానాల్లోనూ జనసేన మద్దతుదారులు పోటీలో నిలిచారు. ఈ 60లో 11 చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవగా... మరో 12 చోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. వైసీపీ 37 చోట్ల గెలిచింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయం ఉంది. వైసీపీ విజయం సాధించిన 37 చోట్ల కూడా జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఒకరకంగా ఇది వైసీపీకి షాకింగ్ న్యూసే. అయితే ఒక్క ఎమ్మెల్యే రాపాకపై రివెంజ్ తీర్చుకోవాలన్న కసితోనే జనసైనికులు పని చేసినట్టు సమాచారం.
వైసీపీ గురించి చెప్పాలంటే అర్థబలంతో పాటు అంగబలమున్న పార్టీ. ఈ పార్టీని ఢీకొట్టాలంటే జనసేన వంటి పార్టీకి చాలా కష్టం. అలాంటిది ఢీకొట్టడమే కాదు.. రెండవ స్థానంలో నిలిచారంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారిన మరో విషయం ఏంటంటే.. ఎమ్మెల్యే సొంతూరు చింతలమోరి. ఈ ఊరిలో ఒక అభ్యర్థికి ఎమ్మెల్యే రాపాక మద్దతిచ్చారు. అలాగే వైసీపీ అభ్యర్థిగా మరో వ్యక్తి పేరును నియోజకవర్గ అధికార పార్టీ ఇన్చార్జి అమ్మాజీ ప్రకటించారు. ఇక్కడ అతికష్టమ్మీద ఎమ్మెల్యే మద్దతిచ్చిన అభ్యర్థి గట్టెక్కారట. రానున్న రోజుల్లో జనసేన నుంచి రాపాక ఇంకా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout