ఇలా అయితే కష్టమే.. పవన్ కల్యాణ్ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం..
- IndiaGlitz, [Monday,December 25 2023]
టీడీపీ పొత్తు పెట్టుకోవడం జనసేన క్యాడర్‌కు నచ్చలేదా..? తమ అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న కార్యకర్తల ఆశలు అడియాశలేనా..? ఇతర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావడం కోసం తాము ఎందుకు పనిచేయాలనుకుంటున్నారా..? కూరలో కరివేపాకులా తమను వాడుకుంటున్నారని భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇటీవల యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ అతిథిగా వెళ్లడం.. ఆ వెంటనే లోకేశ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబే సీఎం అని ఘంటాపథంగా చెప్పడంతో జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నారా లోకేశ్ మాటలపై ఫైర్..
ఇప్పుడు ఇదే అంశం జనసేన పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నామని మదనపడుతున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జనసేనను వాడుకుంటున్నారని రగిలిపోతున్నారు. సాధారణంగా పొత్తులు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు కూలంకశంగా చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పొత్తు ధర్మం. కానీ ఏకపక్షంగా చంద్రబాబే తమ కూటమి సీఎం అభర్థి అని లోకేశ్ ఎలా ప్రకటిస్తారని జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబును జైల్లో ఉన్నపుడు సంఘీభావం ప్రకటించి ఆయనతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను పవన్ కల్యాణ్ గౌరవప్రదంగా ప్రకటించారని.. కానీ లోకేశ్ ఇలా ఎలా ప్రకటన చేస్తారని నిలదీస్తున్నారు.
అమ్ముడుపోయారా..? అనే సందేహాలు..
టీడీపితో కలిసి పనిచేసేందుకు ఎన్నో అవమానాలు భరిస్తున్నామని.. చివరకు కేంద్రంలోని బీజేపితో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్దపడితే ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని ఫైర్ అవుతున్నారు. జనసేనను టీడీపీ దగ్గర తాకట్టుపెట్టారనే ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని.. ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులను చూసే కదా చంద్రబాబైనా, ప్రధాని మోదీ అయినా పవన్ కల్యాణ్ గౌరవం ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఉంటే ఉండండి.. పోతే పోండి అని జనసేనాని అనడంపైనా మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చంద్రబాబుకు అమ్ముడుపోయారా అనే సందేహాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
వేరే దారి చూసుకుంటామని హెచ్చరిక..
ఇదిలా ఉంటే సీట్లు డిమాండ్ చేయాల్సింది పోయి.. చంద్రబాబు ఇచ్చే టికెట్లతో సరిపెట్టుకోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. అసలు తమ పార్టీకి కూడా చంద్రబాబే సీట్లు కేటాయిస్తారా ? అని నిలదీస్తున్నారు. తామంతా పవన్ కోసం పోరాడుతుంటే.. అయనేమో చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మదనపడిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే తమ దారి తాము చూసుకోవడం మేలనే భావనలో ఉన్నారు జనసైనికులు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామని.. 2019లో పరోక్షంగా తమను ఎదగనీయకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. అసలు ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా..? లేక టీడీపీలో విలీనం చేస్తారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేనకు బై చెప్పడమే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా పవన్ కల్యాణ్ కానీ.. పార్టీ పెద్దలు కానీ.. స్పందించకపోవడంతో కార్యకర్తలు మరింత ఆగ్రహంతో రగిపోతున్నారు.