Jana Sena, BJP:తెలంగాణలో కమలంతో జనసేన దోస్తీ.. మరి ఏపీలో పరిస్థితేంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నగారా మోగి ప్రచారం హోరెత్తుతుండగా.. ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో ఎన్నికల బరిలో దిగారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా తన ప్రసంగంలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తులో ఉన్నారు. వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని.. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. కానీ ఉమ్మడిగా కలిసి ప్రభుత్వంపై పోరాటం చేసిన దాఖలాలు లేవు. జనసేన ఒక్కటే ప్రభుత్వ పాలనపై తీవ్ర పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించేశారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇంతవరకు బీజేపీ పెద్దల నుంచి సరైన స్పందన లేదు.
తెలంగాణలో మాత్రం జనసేనతో కలిసి కమలం నేతలు ఎన్నికలకు వెళ్తున్నారు. ఏపీలో ఎన్నికల నాటికి బీజేపీ కూడా తమ కూటమికి మద్దతు ఇస్తుందని పవన్ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని.. టీడీపీతో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ తమతో జనసేన కలిసి రాకపోతే ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఓవైపు ఏమో బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ భావిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం జనసేన తమతో కలవకపోతే ఒంటరిగా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రజలు డైలమాలో పడ్డారు. అక్కడ ఉన్న పొత్తు ఇక్కడ ఎందుకు ఉండటం లేదని చర్చిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ఇస్తుందా? లేదా అనేది వేచిచూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout