Pawan Kalyan:సీఎం పదవిపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పోయి.. జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చేలా కలిసి ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం పదవి పట్ల ఎప్పుడు విముఖతతో లేనని.. ప్రజలు తనకు ఆ పదవి అప్పగిస్తే కచ్చితంగా తీసుకుంటానన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీఎం స్థాయి కంటే ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నదే జనసేన ఆకాంక్ష అన్నారు. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుందన్నారు.
అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే టీడీపీతో పొత్తు..
వచ్చే ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేయాలని.. ఆ దిశగానే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి జనసేన బలమైన దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాడు 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైందని ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని వెల్లడించారు. పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా తాను ఒక్కడినే తీసుకునేది కాదని.. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నామని చెప్పారు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీలక సభ్యులేనని వివరించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
సీఎం జగన్కు ఇంగ్లీష్ గొప్పగా రాదు కదా..
మొదటి నుండి తామే విద్యాశాఖ లోటుపాట్లను ప్రశ్నిస్తున్నామని.. కాలేజ్ విద్యార్దులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం రాసే టోఫెల్ పరీక్ష 3వ తరగతి విద్యార్థులకు ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం అమెరికన్ యాక్సెంట్ కోసం వేల కోట్లు ఖర్చు పెడతాం అనడం సరికాదన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం జగన్ మాట్లాడే ఇంగ్లీష్ అంత గొప్పగా ఉండదని.. అయినా మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు కదా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు వెటకారాలు, వ్యంగ్యంగా మాట్లాడటం కాకుండా తాము అడిగిన వాటిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆమంచి స్వాములను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది..
అంతకుముందు జనసేన పార్టీలో వివిధ కమిటీల్లో స్థానం పొందిన 16 మందికి పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి స్వాములు పార్టీలో చేరిన రోజు నుండి ఆయనను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. అయినా సరే ఆయన బలంగా నిలబడ్డారని గుర్తు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com