పార్టీ ఆవిర్భావం రోజే జనసేన అభ్యర్థుల ప్రకటన!
- IndiaGlitz, [Thursday,March 07 2019]
జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు మార్చి 14. 2014లో జనసేన ఊపిరిపోసుకున్న రోజు నుంచి ఈ అయిదేళ్ల పాటు తన వంతుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను చూపించారు. కాగా మార్చి 14 అనేది జనసైనికులకు ఒక మరిచిపోలేని రోజుగా చెప్పుకోవచ్చు. ఈసారి జనసేన ఆవిర్భావ సభకు గోదావరి గట్టున ఉన్న చారిత్రాత్మక నగరం రాజమండ్రి వేదిక కానుంది. జనసైనికులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈసారి సభను ఇక్కడ జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సభ జరగనుంది. రాజమండ్రి తర్వాత విశాఖ, విజయవాడ వంటి ఎన్నో నగరాలలో జనసేన సభలు జరగనున్నాయి. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా సభలో పాల్గొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా జనసేన ప్రతినిధులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.
సభ ఏర్పాట్లు చూసేది వీళ్లే..
కాగా.. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 15మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ కమిటీలో ఆకుల సత్యనారాయణ, దుర్గేష్, బన్ని వాసు, పసుపులేటి సుధాకర్, శ్రీమతి రాధమ్మ , సరోజిని, యామిని జ్యోత్స్న, పేసంగి ఆదినారాయణ, పంతం నానాజీ, నవుడు వెంకటరమణ, యర్రంకి సూర్యరావు, శ్రీను బాబు, రాపాక వరప్రసాద్, కమలుద్ధీన్, దొమ్మేటి వెంటేశ్వర్లు ఉన్నారు.
అభ్యర్థుల ప్రకటన ఆ రోజేనా..!?
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కో జిల్లా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే ఇంత వరకు పవన్ కల్యాణ్ మాత్రం అధికారికంగా ఏ ఒక్కర్నీ ప్రకటించలేదు. స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో బయోడేటాలు సేకరించి.. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ గ్యాప్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని.. సభలో కచ్చితంగా కొంతమంది అభ్యర్థులనైనా జనసేనాని ప్రకటిస్తారని అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన ఉంటుందా..? లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే మరి.