రాపాకను రప్ఫాడేస్తున్న జన సైనిక్స్.. అసలేం జరిగింది!
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికల్లో జనసేన తరఫున వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ రెండు చోట్లా ఓడినప్పటికీ ఆయన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో గెలుపొందారు. అయితే.. ఆయన పార్టీ తరఫున గెలిచారంతే కానీ.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ.. పార్టీ తరఫున మాట్లాడింది కానీ.. మరీ ముఖ్యంగా అధినేతతో కలిసి వేదికను పంచుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువేనని చెప్పుకోవాలి. నిద్రలేచింది మొదలుకుని పడుకునే వరకూ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భజనే ఎక్కువైందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
అన్నీ పొగడ్తలే.. అటు ఏమీ లేదే!
మరీ ముఖ్యంగా.. ‘సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. సీఎం జగన్ నిర్ణయాలన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను’ ఇలా జగన్‌ను ఆకాశానికెత్తేయడమే కాకుండా పాలాభిషేకాలు చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఇలా ఇంగ్లీష్ మీడియం మొదలుకుని మూడు రాజధానుల వరకూ ప్రతి విషయంలోనూ జగన్ నిర్ణయాలకే రాపాక జై కొట్టారు. అంతేకాదు అసెంబ్లీ వేదికగా.. మీడియా వేదికగా కూడా పవన్‌ను పక్కనెట్టి.. జగన్‌ను పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయ్. జగన్ నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తుండగా రాపాక మాత్రం జై కొడుతుండటంతో అసలేం జరుగుతోందో జనసైనికులకు అర్థం కాని పరిస్థితి. అయితే.. తాజాగా.. జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియోను పట్టుకుని జనసైనికులు రాపాను రప్ఫాడేస్తున్నారు.
అసలేం జరిగింది!?
ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఇందులో భాగంగా రాపాక కూడా విచ్చేసి జగన్ వద్దకు వెళ్లడానికి ఆయన యత్నించారు. తీరా చూస్తే.. కానీ ఏం జరిగిందో ఏమో ఆయన్ను జగన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పక్కకు నెట్టేశారు. అయితే ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాదనుకున్నారో లేకుంటే.. ఆయనెవరో ప్రజాప్రనిధి కాదు సామాన్యుడనుకున్నారో తెలియట్లేదు కానీ.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అడ్డుకోవడంతో అక్కడున్న జనాలు.. పేపర్లలో దీని తాలుకు ఫొటోలు చూసినోళ్లు ముక్కున వేలేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పట్టుకున్న జనసైనికులు ఆయన్ను గట్టిగానే తిట్టిపోసేస్తున్నారు.
మీకు జరగాల్సిందేలే..!
ఇదే అదునుగా చేసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ఆయన్ను..‘ ఇక చేసుకోండి పాలాభిషేకం, పూలాభిషేకం’ అని కొందరు అంటుండగా.. నియోజకవర్గ ప్రజలు కష్టపడి గెలిపించుకున్న వ్యక్తి వేరే పార్టీకి మద్దతిస్తే అలాంటి వ్యక్తికి సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుంది అనే దానికి ఉదాహరణే ఈ ఘటన అని మరికొందరు సెటైర్లేస్తున్నారు. అంతేకాదు.. రాపాక గారు మిమ్మల్ని, జనసేనలో ‘పల్లకి’లో మోసేవారు.. అదే వైసీపీలో అయితే ‘పక్కకి’ తోసేస్తున్నారు. ఇప్పుడైనా అర్థమవుతోందా లేదా.. మీకు ఇలాంటివి జరగాల్సిందిలే? అని జనసైనికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ రాపాక రియాక్ట్ అవ్వనే లేదు.. ఒకవేళ స్పందిస్తే ఎలా ఉంటుందో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout