Jamili Elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం..!

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల హడావిడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే కొద్ది రోజుల నుంచి జమిలి ఎన్నికల(Jamili Elections) గురించి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా పావులు కదుపుతోంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కమిటీ పలు రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల అభిప్రాయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకే దేశం-ఒకే ఎన్నికపై లా కమిషన్‌(Law Commission) త్వరలోనే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2029లో మే-జూన్ నెలల మధ్య జమిలి ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదించనుందని సమాచారం. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు కమిషన్‌ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా అయితేనే 19వ లోక్‌సభకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహంచే వీలు ఉంటుందని కమిషన్‌ అభిప్రాయపడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

లా కమిషన్‌ చేయనున్న సిఫార్సులు ఇవే..

రాజ్యాంగంలో కొత్తగా చేర్చే అధ్యాయంలో ఏకకాల ఎన్నికలు, సుస్థిరత, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలి.

అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త ఆధ్యాయం రూపొందించాలి.

జమిలి ఎన్నికలకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను మూడు దశల్లో సర్దుబాటు చేయాలి. అంటే కొన్ని శాసనసభల కాల వ్యవధిని పొడిగించడం, తగ్గించడం వంటివి చేయాలి.

ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్‌ ప్రభుత్వాలు ఉన్నా.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి.

ఇలా చేయడం కుదరకపోతే అసెంబ్లీ మిగతా కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. ఉదాహరణకు 2032లో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే.. మిగిలిన రెండు సంవత్సరాల కాలానికి మాత్రమే ఎన్నికలు జరుపుతారు. అనంతరం 2034లో జరిగే జమిలి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.