తొలి జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ ఇక లేరు..
Send us your feedback to audioarticles@vaarta.com
హాలీవుడ్ తొలి 'జేమ్స్ బాండ్' పాత్రధారి సీన్ కానరీ(90) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సీన్ కానరీ శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాన్ సీనరీ స్కాటిష్‌లో జన్మించారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన తన 90వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. మూడు నెలలు తిరగకుండానే ఆయన మరణించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 6 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించి మెప్పించారు. ఆయన నటనకు ఆస్కార్ సహా పలు అవార్డులు లభించాయి. సీన్ కానరీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులు ఆయనను ఆదరించారు.
'ది విండ్ అండ్ ది లైన్', 'ది మేన్ హు వుడ్ బి కింగ్', 'ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్', 'ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్' వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. 'ది అన్ టచబుల్స్' సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడుగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్ , గోల్డ్ ఫింగర్ , థండర్ బాల్ , యు ఓన్లీ లివ్ ట్వైస్ , డైమండ్స్ ఆర్ ఫరెవర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వయసు పెరిగినప్పటికీ సీన్ కానరీకి డిమాండ్ మాత్రం తగ్గలేదు.
1999లో అంటే దాదాపు 70 ఏళ్ల వయసులో పీపుల్స్ మ్యాగజైన్ 'సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీ'గా సీన్ కానరీ ఎంపికవడం విశేషం. సీన్ కానరీ తన 17వ ఏట రాయల్ నేవీలో చేరారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా మూడేళ్ల తర్వాత ఆయన నేవీ నుంచి బయటకు వచ్చారు. 1950లో మిస్టర్ యూనివర్స్ పోటీలో మూడో స్థానం గెలుచుకున్నారు. 2008లో సీన్ కానరీ తన ఆటో బయోగ్రఫీ 'బీయింగ్ ఎ స్కాట్' ప్రచురించారు. ప్రతిష్ఠాత్మక నైట్ హుడ్, అకాడమీ అవార్డులు అందుకున్నారు. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత నట జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే 2012లో ఓ చిత్రానికి మాత్రం సీన్ కానరీ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments