Download App

Jamba Lakidi Pamba Review

ప‌రిశ్ర‌మ‌లో మొద‌లైన ఇన్నేళ్ల‌ల్లో ద‌శాబ్దానికి ఒక సినిమా అని లెక్క‌లేసుకోవాల‌న్నా, ఎంపిక చేసుకోవాల‌న్నా.. వాటిలో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక‌కించిన జంబ‌ల‌కిడి పంబ క‌చ్చితంగా చోటుచేసుకుంటుంది. అప్ప‌టిదాకా తెలియ‌ని కొత్త ప‌దం జంబ‌ల‌కిడి పంబ‌. దానికి తోడు స్త్రీలు పురుషులుగా మార‌డం, పురుషులు స్త్రీలు కావ‌డం... దాని వ‌ల్ల పుట్టే కామెడీ, ఆ పాత్ర‌ల తీరుతెన్నుల బాగోగులు.. ఇలా ఒక‌టేంటి? ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కార‌ణాలు బోలెడు. ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీనివాస‌రెడ్డి హీరోగా ఓ సినిమా విడుద‌లైంది. పాత చిత్రంతో పోలిక లేదు అని చిత్ర యూనిట్ అదే ప‌నిగా చెబుతూనే ఉన్న‌ప్ప‌టికీ, త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఎక్క‌డో ఓ చోట పోల్చ‌డానికే ప్ర‌య‌త్నిస్తారు మ‌రి. ఇంత‌కీ ఎవ‌రు స‌ఫ‌ల‌మ‌వుతారు?  పాత సినిమా పేరు పెట్టుకున్న చిత్ర యూనిట్టా?  పాత సినిమాకు ఏమాత్రం త‌గ్గ‌ని వినోదాన్ని ఆశించే ప్రేక్ష‌కులా?  చ‌దివేయండి.. ఆల‌స్య‌మెందుకు? 

క‌థ‌:

వ‌రుణ్ (శ్రీనివాస‌రెడ్డి) సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప‌ల్ల‌వి (సిద్ధి ఇద్నాని)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లికి వారి పెద్ద‌లు అంగీక‌రించ‌రు. అయినా వారి దాంప‌త్యం పెళ్ల‌యిన కొత్త‌ల్లో అన్యోన్యంగానే సాగుతుంది. అనుమానం వ‌ల్ల నెమ్మ‌నెమ్మ‌దిగా వారి కాపురంలో క‌ల‌త‌లు మొద‌ల‌వుతాయి. అయితే వాటిని ప‌రిష్క‌రించుకోవ‌డం మానేసి, ఇద్ద‌రూ విడాకుల‌కోసం అప్ల‌య్ చేస్తారు. అప్ప‌టికే 99 విడాకుల కేసుల్లో ఆరితేరిన లాయ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ (పోసాని) వీరి కేసును ప్రెస్టీజియ‌స్‌గా ఫీల‌వుతాడు. అంత‌లోనే ప్ర‌మాదంలో కన్నుమూస్తాడు. అత‌నికి స్వ‌ర్గంలో ప్ర‌వేశం ద‌క్క‌దు. విడ‌దీయాల‌నుకున్న‌వారిని క‌లిపితేనే ప్ర‌వేశం అని నిక్క‌చ్చిగా చెబుతాడు య‌మ‌పురివాసుడు (సుమ‌న్‌). దాంతో చేసేదేమీ లేక జంట‌ను క‌లిపే ప్ర‌య‌త్నంలో ప‌డ‌తాడు హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్‌. విడ‌దీయ‌డం తేలికా?  క‌ల‌ప‌డం తేలికా?  అనే ప్ర‌శ్న అత‌నిలో అప్పుడే మొద‌ల‌వుతుంది. అంత తేలిక కాద‌న్న విష‌య‌మూ బోధ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో అతను చేసిన ఫీట్లు ఏంటి?  వారిద్ద‌రిని ఎలా క‌లిపాడు? అస‌లు క‌ల‌ప‌గ‌లిగాడా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప్లస్ పాయింట్లు:

సినిమాకు టైటిలే ప్ల‌స్ పాయింటు. శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న‌, కొన్ని పాట‌ల్లో డ్యాన్సులు కూడా బావున్నాయి. సిద్ధి ఇద్నాని తొలి ప‌రిచ‌య‌మే అయిన‌ప్ప‌టికీ బాగా చేసింది. అమ్మాయిగానూ లుక్స్ బావున్నాయి. అబ్బాయి మేన‌రిజ‌మ్స్ ని కూడా చ‌క్క‌గా పండించింది. పాయింట్‌గా సినిమా మంచిదే. 

మైన‌స్ పాయింట్లు:

సాగ‌దీత‌త‌గా అనిపిస్తుంది. ఈ త‌ర‌హా సినిమాల‌కు కామెడీ స‌న్నివేశాలే ప్రాణం. ఈ చిత్రంలో కామెడీ పండ‌లేదు. పైగా ప్రేక్ష‌కులు సీట్ల‌లో విసుగ్గా క‌దిలేలా చేసింది. పాట‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల నుంచి బ‌య‌టికి వెళ్ల‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. సెకండాఫ్ అయితే మ‌రీ స‌హ‌నానికి ప‌రీక్ష‌లా మారింది. స్క్రీన్ ప్లే బాగోలేదు. కామెడీ పండ‌లేదు. ఎడిటింగ్ స‌రిగా లేదేమో అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:

జంబ‌ల‌కిడి పంబ అనే టైటిల్‌ని చూసిన మ‌ధ్య వ‌య‌స్కులు ఎవ‌రైనా స‌రే ఈవీవీ సినిమాను దృష్టిలో పెట్టుకునే టిక్కెట్టు కొంటాడు. అయితే వారికి ఈ సినిమా ఆ సినిమాను త‌ప్ప‌కుండా గుర్తు చేస్తుంది. అప్పుడే ఈ త‌ర‌హా సినిమాలో ఈవీవీ అంత కామెడీని ఎలా పండించ‌గ‌లిగాడా అని ఆయ‌న్ని గుర్తుచేసుకుని త‌ప్ప‌క ప్ర‌శంసిస్తారు. ఈ సినిమా పాయింట్‌గా బాగానే ఉన్నా, క‌థ‌గా మెప్పించ‌లేక‌పోయింది. స‌న్నివేశాల్లో ఎక్క‌డా బ‌లం క‌నిపించ‌దు. శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి న‌ట‌న మెప్పిస్తుంది. మిగిలిన పాత్ర‌లు కూడా త‌మ‌కు కేటాయించిన ప‌రిధి మేర‌కు చ‌క్క‌గానే న‌టించారు. అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు తెప్పించింది. ర‌ఘుబాబు కొంచెం గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో క‌నిపించారు. ఆయ‌న స‌న్నివేశాలు కాసింత బాగానే ఉన్నాయి. ఎటొచ్చీ ఆత్మ‌లు మారిన త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాలే మ‌రీ దారుణంగా, ఓపికకు ప‌రీక్ష పెట్టేలా ఉన్నాయి. చీటికీ మాటికీ విడాకులు తీసుకునే జంట‌ల‌కు ఈ సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వాల‌నుకున్నారు. ఎదుటివ్య‌క్తి స్థానంలో నిల‌బ‌డి ఆలోచిస్తే అంతా స‌వ్యంగానే జ‌రుగుతుంద‌ని చెప్ప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఇంత విసుగులో ఆ సందేశం ప్రేక్ష‌కులకు ఎంత వ‌ర‌కు చేరువ‌వుతుంద‌నేది అనుమానం.

బాట‌మ్ లైన్‌:  ఈవీవీ గొప్ప‌త‌నం మ‌రోసారి గుర్తుచేస్తుంది. 

Jamba Lakidi Pamba Movie Review in English

Rating : 2.0 / 5.0