YCP Candidate:దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు(Thota Trimurthulu)కు భారీ షాక్ తగిలింది. దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు 18 నెలల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు నిందితులకు కూడా ఇదే శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుతో దళిత, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఐదుగురు దళితులను తీవ్రంగా హింసించారు. ఇందులో ఇద్దరు యువకులకు గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించి అవమానించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ ఈ కేసు పలు కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఉంది.
బాధితుల్లో ఒకరు చనిపోగా.. మిగిలిన నలుగురు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి కోటి రాజు సైతం చనిపోయారు. దాదాపు 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. ఈ విచారణలో త్రిమూర్తులతో పాటు మరో 5 మందిని నిందితులుగా చేరుస్తూ కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. అయితే రెండేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడటంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాగా ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎవరికైనా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు.
కాగా తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1994, 99 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం 2014లో తిరిగి టీడీపీలో చేరి మండపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com