Jai Simha Review
శతచిత్రాలను పూర్తిచేసుకున్న బాలకృష్ణ తన 101వ సినిమాను మొదటి చిత్రంగా భావిస్తున్నట్టు `పైసా వసూల్` సమయంలో చెప్పారు. `జై సింహా`లో ఆయన వేసిన స్టెప్పులు, చేసిన ఫైట్లు, పలికిన పలుకులు చూసిన వారందరూ ఆయన్ని చూసి మరోసారి మంత్రముగ్ధులు కాకమానరు అని ఈ మధ్య నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. `స్నేహం కోసం`, `బావ నచ్చాడు` సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితుడైన కె.యస్.రవికుమార్ తెలుగులో చేస్తున్న మూడో సినిమా `జై సింహా`. బాలకృష్ణ - నయనతార నటించిన మూడో సినిమా ఇది.. గత కొన్నేళ్లుగా సంక్రాంతి రేసులో ఉంటోన్న బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి సీజన్‌కు పండుగలా మారుతారా.. ఆలస్యం ఎందుకు చదివేయండి!
కథ:
తన బిడ్డతో కూర్గు.. అక్కడి నుంచి కేరళ.. ఆ తర్వాత కుంభకోణం చేరుకుంటాడు నరసింహ (బాలకృష్ణ). అక్కడ ఆలయ ధర్మకర్త (మురళీమోహన్) ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఆయన కుమార్తె ధాన్య (నటాషా దోషి) చేసిన ఓ తప్పును తనపై వేసుకుంటాడు. అయితే ఆ తప్పు వల్ల అతను ఎక్కడున్నాడన్నది విశాఖపట్టణంలో ఉన్న బిజినెస్‌మ్యాన్ (అశుతోష్ రాణా)కు తెలిసిపోతుంది. తన బిడ్డను స్కూల్‌లో చేర్చాలని నరసింహ కుంభకోణంలో ఓ స్కూల్‌కి వెళ్తాడు. అక్కడ గౌరీ(నయనతార)ను చూస్తాడు. ఆమె కంట పడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో ఆమె బిడ్డనే కాపాడాల్సి వస్తుంది. బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి.. అసహ్యించుకుంటుంది గౌరీ. ఇంతకీ గౌరీకి, నరసింహకు ఉన్న బంధం ఏంటి? నరసింహ భార్య రంగ (హరిప్రియ) ఏమైంది? ఎవరికంటే వాళ్లకి దణ్ణం పెట్టని స్కూల్ మాస్టర్ (ప్రకాశ్‌రాజ్) నరసింహను ఎందుకు చేతులెత్తి మొక్కాడు? మధ్యలో కనియప్పకు, నరసింహకు ఉన్న వైరం ఏంటి? ఏసీపీకి నరసింహ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏసీపీకి, గౌరీకి ఉన్న బంధం ఎలాంటిది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
కథ డిమాండ్ చేయాలేగానీ యంగ్ హీరోలతో సమానంగా స్టెప్పులు వేయడానికి, ఫైట్లు చేయడానికి, ఎమోషన్‌గా డైలాగులు చెప్పడానికి, సెంటిమెంట్ పండించడానికి బాలకృష్ణ సిద్ధంగా ఉంటారని మరోసారి నిరూపించిన సినిమా ఇది. `జై సింహా`లో బాలకృష్ణకి మేకప్, విగ్, కాస్ట్యూమ్స్ చక్కగా సూట్ అయ్యాయి. ముగ్గురు హీరోయిన్లు కూడా ఏదో పాటల కోసం కాకుండా, కథలో చక్కగా ఇమడటం బావుంది. గర్భగుడి పవిత్రతను, పురోహితుల ప్రాధాన్యతను చెప్పే సీను, రాస్తారోకోల వల్ల ప్రజలు పడే ఇబ్బందులు, నాయకులకు ప్రజలు సహకరించకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి... వంటి అంశాలను వివరించే సీన్లు బావున్నాయి. నటీనటులందరూ తమ పరిధుల్లో చక్కగా నటించారు. నేను చదువుకోలా.. అని చెప్పే డైలాగుతో పాటు అక్కడక్కడా వినిపించిన సింహం డైలాగులు కూడా బావున్నాయి.
మైనస్ పాయింట్లు:
ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ అంతగా రక్తి కట్టించదు. హీరో చుట్టూ గ్యాంగ్ ఉన్నట్టే అనిపించినా పెద్దగా నవ్వు రాదు. పైగా చంద్రముఖి, నాగవల్లి వంటి సినిమాల సన్నివేశాలను గుర్తుచేస్తాయి. కుంభకోణంలోనే పెద్ద రౌడీ అయిన వ్యక్తికి తగ్గ విలనిజం ఇందులో కనిపించదు. హీరో ముఖంలో కనిపించిన ఎమోషన్‌ని అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయలేకపోయింది.
విశ్లేషణ:
బాలకృష్ణ నటించిన 102 సినిమా, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా, కె.యస్.రవికుమార్‌కి తెలుగులో మూడో సినిమా.. ఇలాంటి పలు అంశాల వల్ల సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే యూనిట్ శ్రమదాచుకోకుండా కష్టపడింది. బాలయ్యతో సహా యూనిట్ పడ్డ శ్రమ తెరమీద కనిపించింది. అమ్ముకుట్టి పాటలో బాలయ్య డ్యాన్సులు మెప్పించాయి. నయనతార నటన, ప్రకాశ్‌రాజ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అయింది. అయితే కుంభకోణం కనియప్పగానీ, ఇటు విశాఖపట్టణం వీఐపీగానీ పెద్దగా విలనిజాన్ని చూపించలేకపోయారు. అశుతోష్‌రానా పట్టరానంత కోపాన్ని ప్రదర్శించినట్టు కనిపించినా బ్యాక్‌గ్రౌండ్ ఎలివేషన్ లేకపోవడంతో సన్నివేశాలు వీగిపోయాయి. దానికి తోడు పలు సందర్భాల్లో ఇతర చిత్రాల్లోని సన్నివేశాలు గుర్తుకొచ్చాయి. అయితే తన భార్య చనిపోయిందన్న నమ్మకుండా భర్త హాస్పిటల్ గదికి బయటకు వచ్చి పిలిచే సన్నివేశం, తండ్రి వెళుతున్న వైపే బిడ్డ చూసే ఆఖరి సన్నివేశాలు మాత్రం సినిమాకు హైలైట్ అవుతాయి. రవికుమార్ మార్కు సన్నివేశాలు ఇలాంటివి కొన్ని అక్కడక్కడా కనిపించాయి. కాకపోతే తన ఉనికిని వదులుకుని బయటకు రావడం, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఉండటం అనే ఫార్ములా మాత్రం బాలయ్యకు కొత్త కాదు. ఇలాంటి విషయాలను తృణీకరిస్తే ఈ సంక్రాంతికి `జై సింహా` సందడి చేస్తుంది.
బాటమ్ లైన్: సంక్రాంతి పందెంలో 'జై సింహా' సందడి
Jai Simha Movie Review in English
- Read in English