నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలో ఎన్టీఆర్ నటిస్తే అది తప్పకుండా అభిమానులందరూ పండుగ చేసుకునేలా ఉండాలని ఎప్పటి నుంచో కల్యాణ్‌రామ్, తారక్ ఇద్దరూ చెబుతూనే ఉన్నారు. ఈ మధ్యనే ఆ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేశారు. సెప్టెంబర్ 21న చిత్రాన్ని విడుదల చేశారు. తల్లిదండ్రులకు అంకితమంటూ అన్నదమ్ములు తొలిసారి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది? ప్రేక్షకుల మెప్పు పొందుతుందా? ఇటీవలి కాలంలో ఏ తెలుగు హీరో కూడా చేయడానికి సాహసించని మూడు పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పిస్తారా? అందులోనూ నెగటివ్ పాత్రలో ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలకూ సమాధానాలు కావాలంటే ఈ రివ్యూలోకి ఎంట్రీ ఇచ్చేయండి మరి..
కథ:
జై, లవ, కుశ (మూడు పాత్రల్లోనూ నటించింది ఎన్టీఆర్) ఒక తల్లి పిల్లలు. జైకి పుట్టుకతోనే నత్తి ఉంటుంది. దాంతో వారి మేనమామ (పోసాని కృష్ణమురళి) జై ని చిన్నచూపు చూస్తాడు. తాను వేయించే నాటకాల్లో లవకుశలను ఎంకరేజ్ చేస్తాడు. జైని పట్టించుకోడు. చిన్నాచితకా అప్రధానమైన వేషాలు ఇస్తాడు. అవన్నీ జై చూస్తూ భరిస్తుంటాడు. ఒకసారి తన బామ్మ నోటి గుండా రావణుడి గురించి తెలుసుకుంటాడు. అవమానం నుంచి పుట్టే అగ్ని చల్లారదని గ్రహిస్తాడు. తన ఇద్దరు తమ్ములపై పగ సాధించుకోవడానికి అగ్నిప్రమాదాన్ని సృష్టిస్తాడు. పెరిగాక జై ఒరిస్సాలోని భైరాంపూర్‌లో డాన్‌గా ఎదుగుతాడు. లవకుమార్ బ్యాంకులో మేనేజర్ అవుతాడు. కుశ అల్లరి చిల్లరి దొంగగా మారుతాడు. పరిస్థితుల కారణంగా లవకుమార్, కుశ ఒకరినొకరు కలుస్తారు. వారిద్దరి ప్రణాళికతో జై తన దగ్గరకు తీసుకొచ్చుకుంటాడు. రాజకీయంగా తన ఎదుగుదలకు వారిద్దరినీ వాడుకుని వదిలేయాలనుకుంటాడు. కానీ తమ్ములిద్దరూ కలిసి అన్నలో తమ చిన్నప్పటి ప్రేమను చూడాలనుకుంటారు. ఆ ప్రయత్నం సఫలమైందా? లేదా? అనేది ఆసక్తికరం. రాశీఖన్నా, నివేదా, నందిత పాత్రలు ఏంటి? వాళ్లు ముగ్గురూ ఎవరికి జోడీగా నటించారు. హంసానందిని, తమన్నా పాత్రలు ఏమేరకు సినిమాలో గ్గామర్ హీట్‌ను పెంచాయి? కాకా (సాయికుమార్) ఎవరు? అతనికి జైకి ఉన్న సంబంధం ఏంటి? సర్కార్ తో చేతులు కలిపిన జై ఎందుకు అతన్నుంచి దూరంగా జరిగాడు? జైకి ఎంపీ సీట్ ఆఫర్ చేసిన సమసమాజ్ వాదీ పార్టీ నేత (నాజర్) చివరికి ఏమయ్యాడు? వంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఎన్టీఆర్ మూడు పాత్రల్లోనూ చాలా బాగా నటించాడు. చిన్నప్పటి ఎన్టీఆర్‌గా నటించిన పిల్లల నటన కూడా చాలా బావుంది. జై పాత్రధారిగా కోరమీసాలతో, నత్తితో, కొరకొర చూపులతో ఒక మేనరిజాన్ని ప్రదర్శిస్తే, బ్యాంక్ మేనేజర్ లవకుమార్‌గా మంచితనం మూర్తీభవించిన వ్యక్తిగా, ఇన్‌షర్ట్ తో చేతిలో లంచ్ బాక్స్, బరువైన బ్యాగ్‌తో చల్లటి చూపులతో రెండో పాత్రతో ఆకట్టుకున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి ఫారిన్ కి వెళ్లిపోవాలనుకునే అల్లరి దొంగగా, నేటి యువతరానికి ప్రతినిధిగా, పోనీటైల్‌తో కాసింత ట్రెండీగా కుశ పాత్రతో మెప్పించారు ఎన్టీఆర్. తండ్రి కోరికను నెరవేర్చాలనుకునే నేటితరం అమ్మాయిగా, పద్ధతిగా ప్రియ పాత్రలో రాశీఖన్నా ఆకట్టుకుంది. మధ్యతరగతి అమ్మాయిగా, పెళ్లిచూపుల సీన్‌లో నందిత మెప్పించింది. హంసానందిని యాజ్ ఇట్ ఈజ్‌గా తన రొటీన్ పాత్రనే ప్లే చేసింది. స్వింగ్ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు కుర్రకారును స్వింగ్ మీద నిలిపేస్తాయన్నది నిజం. కాకా పాత్రలో సాయికుమార్, పిల్లల్ని ఎక్కువ తక్కువగా చూసే మేనమామ పాత్రలో పోసాని, సర్కార్‌గా రోనిత్ రోయ్, అతని ప్రత్యర్థి తమ్ముడిగా అభిమన్యు సింగ్, జైకి కుడి భుజంగా హరీశ్ ఉత్తమన్ పాత్ర, అతని చెల్లెలి పాత్రలో నివేదా థామస్ నటన ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, చోటా.కె.నాయుడు కెమెరా కూడా సినిమాకు ప్లస్ పాయింట్సే. కాస్ట్యూమ్స్, పాటల్లో సెట్స్, జై ఉండే భైరాంపూర్ కోట, అడపాదడపా కొన్ని లొకేషన్లు మెప్పిస్తాయి.
మైనస్ పాయింట్లు:
సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే సినిమా ఇది. అందువల్ల ఫలానా, ఫలానా చోట బాగోలేదు.. ఇదీ లోటు అని చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు చూపించలేం. తొలిసగంలో ప్రియదర్శి కనిపించిన కాసేపు, కుశ పాత్రలో ఎన్టీఆర్ కనిపించినంత సేపు పెదాలపై కాసిన్ని నవ్వులు పూస్తాయి. అంతకు మించి నవ్వుకోవడానికి ఏమీ ఉండదు. పాత్రల సంఖ్య పెరిగిపోవడంతో ఎవరు ఎక్కడ కనిపించారో కాసేపు పోల్చుకోలేం. భైరాంపూర్ ప్రజల్లో మనకు తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు కనిపించరు. రాశీఖన్నా, నివేదా ఉన్నప్పటికీ వారికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. హంసానందిని పాత్ర, సెక్యూరిటీ గార్డ్ పాత్ర పెద్దగా ఎక్కదు. జై మంచి వాడిగా స్థానికులు గుర్తించారన్న విషయాన్ని చెప్పిన పాయింట్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేదేమో. వీటన్నిటికి తోడు సెకండాఫ్ మరికాస్త స్పీడ్‌గా ఉండాల్సింది.
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే..ఎన్టీఆర్ మూడు పాత్రల్లో పెర్ఫామెన్స్‌లో చక్కటి వేరియేషన్ చూపించాడు. ముఖ్యంగా జై పాత్రలో రావణాసురుడి హావభావాలతో మెప్పించాడు. పాత్ర పరంగా జై పాత్రకు కథలో ఉన్న ప్రాముఖ్యతకు, ఎన్టీఆర్ నటన తోడవడంతో సినిమాలో జై పాత్ర ఎఫెక్ట్ ఎక్కువగా కనపడుతుంది. నెగటివ్ షేడ్స్, నత్తిగా మాట్లాడటం తదితరమైన నటనాంశాలతో ఎన్టీఆర్ పాత్రలను చక్కగా ఎలివేట్ చేశాడు. ఇక లవకుమార్ పాత్రలో మంచివాడుగా, నెమ్మదస్తుడిగా చక్కగా నటించగా, దొంగపాత్ర అయిన కుశుడుగా ఎన్టీఆర్ తన నటనతో నవ్వించాడు. ఇక డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్ తన మార్కేంటో మరోసారి రుజువు చేసుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ విషయంలో ముగ్గురు అన్నదమ్ముల నాటకం వేసే సమయంలో జై పాత్రను లవ, కుశ పాత్రధారులు మన్నించమని అడగటం, అలాగే తమ్ముళ్లను క్షమించమని, తనదే తప్పు అని పోసాని ఎన్టీఆర్‌ను ప్రాధేయపడే సన్నివేశంలో కూడా సెంటిమెంట్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. రాశిఖన్నా, నివేదా థామస్ పాత్రలు పాటలకే పరిమితం అయ్యాయి. ఇక సినిమాలోసాయికుమార్, హరీష్ ఉత్తమన్, రోనిత్‌రాయ్ సహా మిగతా నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే దర్శకుడు బాబీ కథను రాసుకున్న విధానం, దానికి డైలాగ్స్ యాడ్ చేసిన విధానం బాగుంది. అయితే మూడు పాత్రలకు నటన పరంగా వేరియేషన్ కనపడేలా పాత్రలను డిజైన్ చేశాడు. కంపెనీలకు అప్పు ఇస్తేవాడు విదేశాలకు పారిపోతాడు. అదే రైతుకు అప్పు ఇస్తే, పారిపోయే ధైర్యం చేయకుండా ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతాడు, మనం ఏదో ఒక వృత్తిని ఎన్నుకుంటాం. కానీ మనకు అన్నం పెట్టే రైతు వృత్తిని మరచిపోతున్నాం, మనకు కడుపు నింపేవాడి కడుపుపైన కొట్టకూడదు వంటి డైలాగ్స్ మెప్పిస్తాయి. ఫస్టాఫ్ చాలా ఫన్నీగా సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో జై పాత్ర మిగిలిన రెండు పాత్రలను డామినేట్ చేయడంతో .లవ, కుశ పాత్రలు డమ్మీగా మారిపోతాయి. సెకండాఫ్‌లో రాజకీయాల అంకంతో సినిమా టెంపోలో వేగం తగ్గింది. ఆ విషయంలో దర్శకుడు బాబీ కేర్ తీసుకని ఉండాల్సింది. తమన్నా స్వింగ్ జరా పాట సందర్భానికి అవసరం లేనిదిగా కనపడుతుంది. ఈ పాట కేవలం తమన్నా కోసం చూడాల్సిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విషయానికి వస్తే, జై పేరుపైనే వచ్చే రావణా ...సాంగ్ మినహా మిగిలిన సాంగ్స్ అన్నీ సోసోగానే ఉన్నాయి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. కథలో కొత్తదనం కనపడదు. సెకండాఫ్ వచ్చేసరికి కథేంటో ప్రేక్షకుడికి ఓ అవగాహన వచ్చేస్తుంది. సినిమాకు మరో పది నిమిషాలు కత్తెర వేసుండాల్సింది. మొత్తంగా జై లవకుశ అభిమానులు మెప్పించే చిత్రమే.
బోటమ్ లైన్: జై లవకుశ.. రావణ నట విశ్వరూపం
Jai Lava Kusa Movie Review in English
Comments