కమ్మ కులం గొప్పేమిటని ప్రశ్నిస్తున్న జగపతి..
- IndiaGlitz, [Saturday,March 26 2016]
సింహ స్వప్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..ఎన్నోవిభిన్నపాత్రలు పోషించి మెప్పించిన ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడు జగపతి బాబు. కథానాయకుడు నుంచి లెజెండ్ సినిమాతో ప్రతినాయకుడుగా మారి హీరోగానే కాకుండా విలన్ గా కూడా మెప్పించగలనని నిరూపించారు. పాత్ర నచ్చితే చిన్న సినిమానా - పెద్ద సినిమానా అని ఆలోచించనని చెబుతున్నారు జగపతిబాబు. ఇక అసలు విషయానికి వస్తే... కమ్మ కులంలో పుట్టిన జగపతిబాబు కమ్మ కులం గొప్పేమిటని ప్రశ్నిస్తున్నాడు. విషయం ఏమిటంటే...ఓ ప్రముఖ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ...నాకు కుల - ప్రాంతాలు గురించి పట్టింపులేదు. ప్రాంతం గురించి పట్టించుకునేవాడిని అయితే జై బోలో తెలంగాణ సినిమాలో నటించేవాణ్ణి కాదు. కులరహిత సమాజాన్నికోరుకుంటున్నాను అని చెప్పారు.
జగపతి కులం గురించి ఇంకా ఏమన్నారంటే...పేరు వెనకాల కులం పేర్లు తగిలించుకోవడం అనేది మనదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఒక కులాన్ని బి.సిలో చేర్చాలి ఎస్సీలో చేర్చాలి ఎస్టీలో చేర్చాలి అనే డిమాండ్లు రాజకీయపరమైన డిమాండ్లుగా భావిస్తాను. కమ్మకులంలో పుట్టాను కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. ఏ కులంలో పుట్టినా ఈ మాటలే చెబుతాను. కమ్మకులంలో పుట్టినంత మాత్రానా నా గొప్ప ఏమిటంటాను. కమ్మ వాళ్లంటే వేరే లోకం నుంచి దిగివచ్చిన వాళ్లు కాదుగా. మిగతా అందరిలాగే కమ్మ వాళ్లు పుట్టారు. అలాంటప్పుడు వాళ్ల గొప్ప ఏమిటి..? వాళ్ల ప్రత్యేకత ఏమిటి..? కులాన్ని వ్యతిరేకిస్తే మన కులం వాళ్లు ఏం చేస్తారో అని భయపడుతున్నాం. కానీ..నిజానికి చాలా మంది అలా లేరు. నన్ను కమ్మ సంఘం వాళ్లు వనభోజనాలకు పిలుస్తుంటారు. కానీ..నేను వెళ్లను. ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంటుంది. ఇలాంటివి పోయినప్పుడే మన సమాజం బాగుపడుతుందనేది నా నమ్మకం అని అంటున్నారు జగపతి. జీవితంలో సక్సెస్ - ఫెయిల్యూర్స్ రెండూ చూసిన జగపతిలో ఏ క్షణంలో మార్పు వచ్చిందో...కానీ ఆ రేంజ్ వ్యక్తి ఈ రేంజ్ లో మాట్లాడడం అంటే నిజంగా గ్రేట్. జీవిత సత్యాన్ని తెలుసుకున్న జగపతి నీకిదే మా హ్యాట్సాఫ్.