జగన్ ‘మార్క్’ నిర్ణయం.. సీఎస్ ఎల్వీకి సడన్ షాక్!
- IndiaGlitz, [Monday,November 04 2019]
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు కేబినెట్ మంత్రులను సైతం ఒక్కోసారి ఆలోచనలో పడేశాయి. ఇప్పటికే కేబినెట్ ఏర్పాటు మొదలుకుని పలువురు కలెక్టర్లు, డీఎస్పీ, ఎస్పీల పలు శాఖలు అధికారుల ప్రమోషన్స్, డిమోషన్స్ వరకు తన మార్క్ ఏంటో వైఎస్ జగన్ చూపించుకున్నారు. అయితే తాజాగా ఏకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంకే సడన్ షాకిచ్చారు. సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్లు జీవో వచ్చింది.
అసలు కారణం ఇదేనా..!
కాగా.. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సీఎస్‌గా ఉన్న ఎల్వీ తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఇంఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అసలు కారణమేంటని ఆరా తీయగా.. సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడమేనని తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేయడంతో అసలేం జరిగింది..? అసలు కారణాలేంటి..? అని తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇందుకు సంబంధించి మరింత సమాచారం.. అసలు కారణాలు తెలియాల్సి ఉంది.