Chandrababu:జగన్ నీ సీన్ అయిపోయింది.. వచ్చేది కూటమి ప్రభుత్వమే: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఆలోచించిన గొప్ప నాయకుడు అని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొనియాడారు.అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి మళ్లీ ఆక్సిజన్ ఎక్కించాల్సిన సమయం వచ్చిందని.. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సైకో జగన్ పోవాలి.. రాష్ట్ర ప్రజలు నివాలి.. అందుకే మూడు పార్టీలు కలిసి కూటమిగా వచ్చామని స్పష్టంచేశారు.
"పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఒకే మాట చెబుతున్నాడు... సైకోజగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి... ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన సీట్ల కోసం ఆలోచించలేదు. ఆయనకు సినీ జీవితంలో గౌరవం లేకనా? అంతకుమించిన గౌరవం ఇక్కడొస్తుందని ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తనను నమ్ముకున్న ఈ ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. నాడు ఇదే విశాఖకు పవన్ వస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పించారు, ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించారు. విశాఖపట్నం వీళ్లబ్బ సొమ్ము అని సైకో అనుకుంటున్నాడు. విశాఖ ఏమైనా వీళ్ల తాత జాగీరా? వ్యక్తిగత విమర్శలు చేశాడు. పవన్ ను ఎంతో అవమానించాడు. పవన్ కు ఇక్కడ విశాఖలో జరిగిన అవమానం జరిగిన తర్వాత నేను విజయవాడ వెళ్లి కలిసి ఆయనకు సంఘీభావం తెలిపాను. తిరిగి నన్ను జైల్లో పెట్టిన తర్వాత, ఇంకేమీ ఆలోచించకుండా పొత్తు ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అదీ ఆయన చిత్తశుద్ధి. సినిమాల్లోనే హీరో కాదు... ప్రజా జీవితంలో నిజమైన హీరో పవన్" అని ప్రశంసించారు.
2047 నాటికి వికసిత్ భారత్ అనేది మోదీ కల... అదే సమయంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది నా కల, పవన్ కల్యాణ్ కల. ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ కావాలి, దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలి, ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్ కావాలి, పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం ఈ కూటమి ద్వారా సాధిస్తాం. ఇప్పుడు మనకు మోదీ గ్యారెంటీ ఉంది, మన సూపర్ సిక్స్ ఉంది. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నాం. 160 అసెంబ్లీ సీట్లు కూటమే గెలుస్తుంది.
ఉద్యోగులను చూస్తే కడుపు నిండిపోయింది. నిన్న, ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైసీపీ వాళ్లు వెళితే... ఒంగోలులో ఛీ కొట్టారు. వాళ్లిచ్చిన డబ్బులు తీసుకోకుండా ఓ మహిళ మా క్యాంపు వద్దకు వచ్చి... వాళ్ల డబ్బును ఛీ కొట్టాం, నేను రూ.10 వేలు ఇస్తున్నా... ఈ డబ్బును పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించాలని కోరిందంటే సీన్ ఎలా మారిపోయిందో అర్థమైందా? ఉద్యోగులంతా కూటమికే ఓట్లేశారు, వేస్తున్నారు కూడా. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలుపు మనదే. సైకో... నీ సీన్ అయిపోయింది, ఇక నీ డబ్బులు పనిచేయవు.
వైసీపీ ఉత్తరాంధ్ర ద్రోహి. సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో రూ.2,500 కోట్లు ఖర్చుపెడితే, జగన్ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెదేపా అధికారంలో ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న రూ.3 వేల పింఛన్‌ను రూ. 4వేలకు పెంచుతాం. ఏప్రిల్ నుంచే దానిని అమలు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛను అందిస్తాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం పెడతా. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com