జగన్ ఘోరంగా ఓడిపోతారు.. ప్రశాంత్ కిషోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎంతో ఉత్కంఠగా సాగిన పోలింగ్ ముగిసి వారం రోజులు అవుతుంది. దీంతో తామే అధికారంలోకి వస్తామని ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి లెక్కలు వేసుకుంటున్నాయి. సీఎం జగన్ అయితే వైసీపీకి ఏకంగా 151 సీట్లు కంటే ఎక్కువ వస్తాయని చెప్పారు. పనిలో పనిగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపైనా కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. పీకే ఊహించని దాని కంటే మెరుగ్గా ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై పీకే తనదైన శైలిలో స్పందించారు.
ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఫలితాలపై మరోసారి తేల్చిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురవుతుందని స్పష్టంచేశారు. తాము కచ్చితంగా గెలుస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఫలితం ఉండబోదని చెప్పారు. జగన్ లాగే అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటి వారు కూడా తాము గెలుస్తామనే చెబుతున్నారని గుర్తుచేశారు. ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరని తెలిపారు.
తాను పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్నానని.. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించబోరని పేర్కొన్నారు. రాబోయే రౌండ్లలో తమకే మెజారిటీ వస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తుంటారని చెప్పారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్నారని.. అయితే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని వివరించారు.
‘‘ఈ ఎన్నికల ఫలితాల్లో నా అంచనాలు తప్పయితే నా ముఖంపై పేడ పడుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాతో సవాలు చేసిన అమిత్ షా ముఖంపై పేడ పడింది. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. నేను చెప్పింది నిజమైతే జగన్ మోహన్ రెడ్డి ముఖంపై పేడ పడుతుంది.. లేదంటే నాపై పడుతుంది’" అన్నారు. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉందని అంతేకానీ ఆగ్రహం లేదని చెప్పారు. అందుకే బీజేపీకి 2019లో వచ్చిన సీట్లకు సమానంగా కానీ అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
కాగా 2019 ఎన్నికలకు ముందు వరకు ఐప్యాక్ సంస్థ తరఫున వైఎస్సార్సీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు మూడు నెలల ముందే జగన్ ఘోరంగా ఓడిపోతారని పీకే చెప్పారు. అప్పుడు ఆయన వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పోలింగ్ ముందురోజు కూడా ఓ తెలుగు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వైసీపీ ఓడిపోతుందని తేల్చిచెప్పారు. తాజాగా పోలింగ్ ముగిశాక కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దీంతో పీకే వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments