'యాత్ర' డైలాగ్‌ను ఓ రేంజ్‌లో వాడేస్తున్న జగన్!

  • IndiaGlitz, [Monday,March 18 2019]

నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నామని అనిపిస్తోంది కదూ.. అవును ఇది ‘యాత్ర’ మూవీలోనిదే. ఈ డైలాగ్‌‌‌‌ను వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఓ రేంజ్‌లో వాడేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది.. ఈ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జగన్ ఈ డైలాగ్‌‌ను గట్టిగానే వాడేస్తున్నారు. సోమవారం సాయంత్రం జగన్ సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోసం ప్రచారం నిర్వహించారు. పులివెందుల-2గా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున వైఎస్ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..

ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశారు. ఒ క్కసారి అవకాశం ఇవ్వండి నాన్నగారి పాలన మళ్లీ తీసుకువస్తానని మాట ఇస్తున్నాను. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఐదేళ్లుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన మీ అందరికి తెలుసు. ప్రతి అడుగులోనూ మోసం..అబద్ధం కనిపిస్తుంది. అన్యాయం, అరాచకం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఎంతటి అన్యాయమైన చేయడానికి వెనుకాడడు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు పాలనలో మీరు చూశారు. రోజుకో కొత్త సినిమా కనిపిస్తుంది. గెలవడం కోసం చేయని అన్యాయం ఉండదు, మోసం ఉండదు, ఉన్న ఓట్లను తీసేస్తారు. దొంగ ఓట్లను చేర్పిస్తారు. ఆధార్‌ డిటెల్స్, బ్యాంకు డిటైల్స్, ఆడవారి టెలిఫోన్‌ నంబర్లు తీసుకుంటారు. ఆ జన్మభూమి కమిటీలకు ఇస్తారు. గెలవడం కోసం రోజుకో సినిమా చూపిస్తారు. చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనుకాడడు అని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

ప్రతి ఒక్కరికీ చెప్పండి..

జిల్లాలో వైసీపీకి అండగా ఉంటున్న మా చిన్నాన్నను చంపడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు. హత్య చేసేది వాళ్లే..మళ్లీ విచారణ చేసేది వాళ్ల పోలీసులే. మళ్లీ దొంగ రాతలు రాసేవన్నీ కూడా వాళ్ల పేపర్లు, వాళ్ల టీవీలే. ఇవాళ యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు..ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోంది. అమ్ముడపోయిన మీడియాతో యుద్ధం జరుగుతోంది. ఎన్నికలు జరిగితే చాలు చంద్రబాబు మూటల కొద్ది డబ్బులు పంపిస్తున్నారు. మీరంతా కూడా ప్రతి ఒక్కరిని కలవండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. అక్కా..చంద్రబాబు రూ.3 వేలు డబ్బులు చేతిలో పెడితే మోసపోవద్దు..20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తారని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించేందుకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎవరూ మోసపోవద్దు..!

గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతారు..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వ్యవసాయానికి ఏడాదికి రూ.12500 ఇస్తారని చెప్పండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. అక్కా..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రిఅవుతారు. అన్న వైయస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకువస్తారు. ప్రతిఒక్కరికి ఉచితంగా రూ.75 వేలు ఇస్తారని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు అంతా కూడా నేరుగా నాలుగు ధపాలుగా మీ చేతుల్లో పెడతారని చెప్పండి. బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే డబ్బులు ఇప్పిస్తారని, అన్న చెప్పాడు..ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తాడని చెప్పండి. అవ్వా తాతల వద్దకు వెళ్లి ..అన్న వస్తున్నాడు..పింఛన్‌ రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయాలని దీవించమని ప్రతి ఒక్కరిని కోరండి అని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

మాటిచ్చా.. నిలబెట్టుకుంటా..!

మీ నియోజకవర్గానికి నేను ఒక మాట ఇచ్చాను. మైనారిటీ సోదరులకు కూడా మాట ఇచ్చాను. వైసీపీలోకి వచ్చిన వెంటనే మైనారిటీలకు మొట్ట మొదల ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వడానికి కూడా కాస్త ఆలోచన చేశాను. కడపలో అంజాద్‌బాషాకు ఇచ్చాను కాబట్టి సాధ్యం కాలేదు. చిత్తూరు జిల్లాలో మైనారిటీలు బాధపడుతారని మదనపల్లిలో మైనారిటీకి టికెట్టు ఇచ్చాం. కాలేజీ గ్రౌండ్స్‌కు సంబంధించి సమస్యను పరిష్కరిస్తాను. మీ అందరి ఆశీస్సులు వైసీపీకి కావాలి. శ్రీకాంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా, మిథున్‌రెడ్డిని ఎంపీగా గెలిపించండి.. మన ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలి అని వైఎస్‌ జగన్‌ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.