Pawan:జగన్కు ఓటమి అర్థమైంది.. అందుకే బేల మాటలు: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్కు ఓటమి అర్థమైందని.. అందుకే ఆయన నోటి నుంచి బేల మాటలు వస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. అంతకుముందు ఏలూరు రోడ్డు, విశాలాంధ్ర మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగుడుగునా జనం నీరాజనం పలికారు. పూలవర్షం కురిపిస్తూ తమ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.
"వైసీపీ నాయకులు గత ఐదేళ్లలో చేయని అరాచకం లేదు.. తిట్టని బూతు లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి సతీమణిని తిట్టారు. సాటి ప్రజాప్రతిధులను చూడలేదు. రోడ్లపైకి బయటకు వచ్చే మహిళలను వదల్లేదు. వీరి ఆగడాలకు ప్రతి ఒక్కరు బలయ్యారు. వైసీపీ గూండాలకు ఒక్కటే చెబుతున్నా. వచ్చే ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారు. ఇకనైనా ఒళ్లు దగ్గరి పెట్టుకుని నడుచుకోండి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం" అని హెచ్చరించారు.
తన ప్రసంగంలో డీపీ నేత వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "రాజకీయాలపై అలిగిన వ్యక్తిని మొట్టమొదటిగా నేను ఈయనలోనే చూస్తున్నా. అనేక పర్యాయాలు గడ్డం పట్టుకుని బతిమాలాను. రా నాన్నా, రామ్మా అని బతిమాలితే అస్సలు మాట వినడే! నా పార్టీలోకి రాకపోయినా కనీసం నువ్వు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండు... విజయవాడ ప్రజలకు నువ్వు అవసరం... నాన్న గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పాను.
ఏదైతేనేం... ఈ రోజున జూలు దులుపుకుని బయటికి వచ్చాడు. ఇవాళ కూడా వారాహి వాహనం కింద దాక్కున్నాడు. వీల్లేదు నువ్వు బయటికి రావాల్సిందే, విజయవాడ ప్రజలకు నువ్వు కనిపించాల్సిందే అని వేదికపైకి లాక్కొచ్చాను. రాధాకు, సోదరుడు వంగవీటి రంగా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకు. బలమైన నాయకుల సమూహాలు కావాలి.
వాస్తవానికి విజయవాడ వెస్ట్ జనసేన సీటు. కానీ బీజేపీ అధినాయకత్వం నన్ను ఒక మాట అడిగింది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. అమరావతిలో బీజేపీ ప్రాతినిథ్యం ఇవ్వాలనే బీజేపీకి సీటు ఇచ్చాను. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.. దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవ మూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ల నాయకుడి తలకు రాయి తగిలిందట! ఆ రాయి ఏంటో గానీ, తల చుట్టూ 360 డిగ్రీలు తిరిగి ఇటు తగిలిందట. దానికి ఆయన ఎంతో బాధపడిపోతున్నారు. ఆయన నటనతో పోల్చితే నేను సినిమాల్లో కూడా అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేను. అది ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్" అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com