ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మరో 30 ఏళ్లు కొనసాగాలి : విజయసాయి రెడ్డి
- IndiaGlitz, [Saturday,December 21 2019]
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనేదే ఆయన ఉద్దేశ్యమన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ... అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చామని తెలిపారు. విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలనే నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు విజయసాయి రెడ్డి. ఏపీలో త్వరలో 25 జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని .. గత ఆరు నెలల్లో సీఎం పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. మరో 30 ఏళ్ల పాటు కూడా జగనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. అయితే టీడీపీ నాయకులు పనిగట్టుకుని మరి .. జగన్ వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రజలే ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. జగన్ పుట్టినరోజును పరస్కరించుకుని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు విజయసాయిరెడ్డి.