Pawan Kalyan:జైలుకు..బెయిల్‌కు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోంది: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
జైలుకు.. బెయిల్‌కు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని. కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. అలాగే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.
"అమలాపురం క్లాక్‌టవర్ నుంచి చెబుతున్నా. జగన్.. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. నిన్ను జైలుకు పంపిస్తాం. జైలుకు.. బెయిల్‌కు మధ్య నీ జీవితం ఊగిసలాడుతోంది. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా.. ఎవడ్రా మమ్మల్ని ఆపేదని? మళ్లీ ఈరోజు చెబుతున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది? భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. కోనసీమను కలహాల సీమగా మార్చి.. కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. వైసీపీ మంత్రి ఇల్లును ఆ పార్టీ వారే తగలు పెట్టుకునేలా చేశారు. కోనసీమ రైల్వేలైన్ లక్ష్య సాధనగానే ఉమ్మడి ప్రభుత్వం కృషిచేస్తుంది. జనసేనను కొందరు నాయకులు వదిలి వెళ్లిపోయారు. నాయకులు వస్తారు వెళతారు. కానీ పార్టీని అంటిపెట్టుకుని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది జనసైనికులు, వీర మహిళలే. జనసైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారు. వైసీపీ పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం" అని పవన్ భరోసా ఇచ్చారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు దగాకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారని.. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గపు చర్యలను చూశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, బీసీలకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల్లో మిగతా వారికి అన్యాయం జరగకుండా వర్గీకరణకు కూడా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ‘బీసీ డిక్లరేషన్‌తో వారి తలరాత మారుతుంది. సబ్‌ప్లాన్‌తో బీసీలను ఆర్థికంగా పైకి తెస్తాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ తెస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడతాం. ఆదరణకు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తాం. చంద్రన్న బీమాను రూ.10 లక్షలు చేసే బాధ్యత మాది’ అని చంద్రబాబు చెప్పారు. "జగన్ ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మీరంతా ఓట్లేశారు. మీలో బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. నేను, పవన్‌కల్యాణ్ మీకు భరోసా ఇవ్వడానికే వచ్చాం. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చితక్కొట్టే బాధ్యత మీది’ అని పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout