జగన్ మరో యూటర్న్.. శాసనమండలి రద్దు నిర్ణయం నుంచి వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన జగన్ సర్కారు… మరో అంశంలోనూ యూటర్న్ తీసుకుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ గతంలో కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. అందుకే శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. అనంతరం మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

కాగా.. జనవరి 27, 2020న శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం దానిని కేంద్రానికి పంపింది. అయితే దాదాపు 22 నెలలుగా కేంద్రం వద్దే ఈ తీర్మానం వుండిపోవడం.. ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో జగన్ ప్రభుత్వం కౌన్సిల్ రద్దు నుంచి వెనక్కి తగ్గింది. సమస్యలు రాకుండా చూసుకోవడం…. రాజకీయంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఈ నిర్ణయాల వెనుక కారణాలుగా కనిపిస్తున్నాయి.