YSJagan:విజయమ్మ ఆశీర్వాదంతో జగన్ తొలి అడుగు.. మళ్లీ మనమే రావాలంటూ పిలుపు..
- IndiaGlitz, [Thursday,March 28 2024]
సీఎం జగన్ ఏపీలో ఎన్నికల వేడి పెంచారు. ఇప్పటికే 'సిద్ధం' సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్.. ఇప్పుడు 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సూక్ష్మంగా వివరించారు. ఎక్కడా లంచాలకు చోటులేకుండా పథకాలు అందించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుతున్న పథకాలు.. అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే పచ్చ మీడియా ద్వారా ప్రభుత్వం మీద తెలుగుదేశం కూటమి విష ప్రచారం చేయిస్తోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు చేసిందని చెప్పుఒకచ్చారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాట్లు పడి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకుని మరీ పొత్తును సాధించారని ఎగతాళి చేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు మ్యానిఫెస్టోను తీసుకొస్తారని, ఎన్నికలు ముగిశాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని గుర్తుచేశారు. అలాగే తన స్వార్థపూరిత రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడతారని విమర్శించారు.
దివంగత మాజీ మంత్రి చిన్నాన్న వివేకానంద రెడ్డి జీవించి ఉన్నపుడు విలన్‌గా చూపించి అయన మరణించాక వారి కుటుంబానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఆనాడు దివంగత సీఎం ఎన్టీ రామారావును సైతం ఇలాగే దుర్మార్గుడు అని చెప్పి పదవి నుంచి దించేసి ఇప్పుడు ఆయన దేవుడు అంటూ విగ్రహాలు పెడుతున్నారని విమర్శించారు. ఇదంతా చంద్రబాబు అవకాశవాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు. బాబాయిని చంపించింది ఎవరో దేవుడికి తెలుసు అని.. చెల్లెమ్మల వెనుక ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అలాంటి వారికి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని వాపోయారు.
అలాగే విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ కూడా చంద్రబాబు వదిన పురందేశ్వరి కుటుంబానికి సంబంధం ఉన్న వారిదేనని జగన్ ఆరోపించారు. కానీ తమపై అబాంఢాలు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నాయకుల కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేసే మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజల్లో నూతనోత్సహాన్ని జగన్ నింపారు.