జగన్ నిర్ణయం వివాదమే.. చిత్తశుద్ధి ఉంటే.. పవన్

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో 1251 ఎకరాల్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయి. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుంది. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు!

‘జగన్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలి. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారు. రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు నెలకొని ఉన్నాయి. అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని వెల్లడిస్తోంది’ అని పవన్ తెలిపారు.