చిరు ఇంటిని ముట్టడించట్లేదు.. : జేఏసీ క్లారిటీ
- IndiaGlitz, [Friday,February 28 2020]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును.. మూడు రాజధానులను నిరసిస్తూ 70 రోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ సంచలన ప్రకటన చేసింది. చిరంజీవి ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించింది. అయితే రేపే ఈ ముట్టడి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో జేఏసీ స్పందించి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చుకుంది. అమరావతి పరిరక్షణ సమితి పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము పిలుపునివ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతి రావు మీడియా ముఖంగా వెల్లడించారు.
అదంతా ప్రచారమే..!
‘సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. చిరంజీవి ఇంటిని ముట్టడికి మేం ఎలాంటి పిలుపు ఇవ్వలేదు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇదివరకే సూపర్ స్టార్ మహేశ్ బాబును విద్యార్థి సంఘాలు ముట్టడించడం.. అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఓ వైపు హైదరాబాద్ పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. అయితే తాజా ఈ ప్రకటన అంతా ఉత్తుత్తే అని తేడంతో మెగాభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. వారిని కఠినంగా శిక్షించాలని మెగాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.