Venu:సతీష్.. దిల్‌రాజుతో కాదు, నాతో మాట్లాడు .. చిల్లర వేషాలొద్దు : బలగం వివాదంపై వేణు వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,March 06 2023]
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘బలగం’. అచ్చ తెలుగు కథతో , హృదయానికి హత్తుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చక్కటి మౌత్ పబ్లిక్‌సిటీతో రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణను సైతం పొందుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత తెరకెక్కించగా.. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.
మా ఇంట్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగానే కథ:
అయితే బలగం కథ విషయంలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ వాదిస్తున్నారు. గతంలో తాను రాసిన పచ్చికి టైటిల్‌తో రాసిన కథకు మార్పులు చేర్పులు తీసి బలగం మూవీ తీశారని సతీశ్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫిలింనగర్లో పెద్ద చర్చకు దారి తీయడంతో దర్శకుడు వేణు మీడియా ముందుకు వచ్చారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనల ఆధారంగా బలగం కథను రాసుకున్నానని వేణు చెప్పారు. తన తండ్రి మరణం తర్వాత ఈ పాయింట్ మెదిలిందని ఆయన తెలిపారు. తనది పెద్ద ఉమ్మడి కుటుంబమని, అందులో వంద మంది సభ్యులుంటారని వేణు తెలిపారు.
దిల్‌రాజు ముందుకు రాకుంటే .. ఈ పాయింట్ తెలిసేదా:
పక్షి ముట్టుడు అనేది తెలుగు సాంప్రదాయమన్న ఆయన.. తనకు కలిగిన ఆలోచనను ప్రదీప్ అద్వైత్తో కలిసి బలగం కథగా మలిచినట్లు వేణు వెల్లడించారు. అనంతరం దీనిని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌కు చెప్పానని.. అలాగే పక్షి ముట్టుడుపై లోతుగా అధ్యయనం చేశానని .. సతీష్ రాసిన కథను తాను చదవలేదన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై ఒక్కొక్కరు ఒకలా కథలు రాశారని వేణు పేర్కొన్నారు. తన కథను వాడుకున్నానని అంటున్న సతీష్ అప్పుడే రచయితల సంఘంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని వేణు ప్రశ్నిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను తీయకుంటే తెలంగాణ సంస్కృతిలోని ముఖ్య విషయం బయటి ప్రపంచానికి తెలిసేది కాదన్నారు. తమ సినిమా కారణంగా మరిన్ని మంచికథలు రాబోతున్నాయని వేణు ఆకాంక్షించారు. దిల్‌రాజు బొమ్మ పెట్టుకుని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నారని.. ఆయన దమ్ముంటే తనతో మాట్లాడాలని , అప్పుడు చెబుతానని వేణు పేర్కొన్నారు.