Download App

Jaanu Review

ఇత‌ర భాష‌ల్లో సినిమాల‌ను తెలుగులోకి రీమేక్ చేయాలంటే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తారు. సాధార‌ణ రీమేక్‌ల‌కే మేక‌ర్స్ అలా ఆలోచిస్తే.. క్లాసిక్ సినిమాల గురించి ఇంకెంత ఆలోచిస్తారో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి క్లాసిక్ సినిమాల‌ను ఎవ‌రైనా రీమేక్ చేయాలంటే వారికి ఇండ‌స్ట్రీ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి నెగ‌టివ్ రియాక్ష‌న్ వ‌చ్చినా నిర్మాత దిల్‌రాజు త‌మిళ చిత్రం 96ను తెలుగులోకి రీమేక్ చేశారు. ఆయ‌న 17 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో చేసిన తొలి రీమేక్ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి, త్రిష న‌టించిన 96 చిత్రం..క్లాసిక్ ల‌వ్‌స్టోరీగా నిలిచిపోయింది. దీన్ని తెలుగులో రీమేక్ అన‌గానే.. ప్రేక్ష‌కుల నుండి కూడా దాదాపు ఎందుకీ ప్ర‌య‌త్నం? అనే స‌మాధానంతో పాటు రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారో అనే ఆస‌క్తి క‌లిగింది. శర్వానంద్‌, స‌మంత న‌టిస్తార‌ని ప్ర‌క‌ట‌న రాగానే.. అస‌లు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష‌కు స‌మానంగా శర్వా, సామ్ న‌టించారా? అనే అతృత‌ అంద‌రిలోనూ క‌లిగింది. మ‌రి 96 రీమేక్ జాను తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?  లేదా? అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

2004లో వైజాగ్‌లో ఓ స్కూల్‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న వారంద‌రూ రీ యూనియ‌న్ కావాల‌నుకుంటారు. వారిలో కె.రామ‌చంద్ర(శ‌ర్వానంద్‌) ఒక‌డు. త‌న క్లాస్‌మేట్ జాన‌కి దేవి(స‌మంత‌)ను ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె కూడా రామ‌చంద్ర‌ను ఇష్ట‌ప‌డుతుంది. కానీ కె.రామ‌చంద్ర కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. 17 ఏళ్లు గ‌డిచిపోతాయి. ఆ త‌ర్వాత అంద‌రూ క‌లుసుకున్నప్పుడు రామ్‌, జాను కూడా క‌లుసుకుంటారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం త‌ను సింగ‌పూర్ వెళ్లిపోవాలి కాబ‌ట్టి.. త‌న‌తోనే స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని జాను రామ్‌ని కోరుతుంది. ఆమె కోరిక మేర‌కు రామ్ ఆమె హోట‌ల్ రూమ్‌కి వెళ్లే క్ర‌మంలో  ఇద్ద‌రూ జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటారు. ఆ క్ర‌మంలో వారి మ‌ధ్య ఎలాంటి ఎమోషన్స్ క‌లిగాయి. చివ‌ర‌కు ఇద్ద‌రి ప్ర‌యాణం ఎంత వ‌ర‌కు ఎలా సాగింది?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష‌:

ప్రేమ‌క‌థ‌ల్లో యూత్‌కి న‌చ్చేవి కొన్నైతే, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేవి కొన్ని.. నేటి తరానికి త‌గ్గట్టు హాట్ ల‌వ్‌స్టోరీస్ కొన్ని ఉంటే నేటి యువ‌త‌రంతో పాటు అంద‌రి హృద‌యాల‌ను తాకేలా సెన్సిటివ్ ప్రేమ క‌థాంశాలు కొన్ని ఉంటాయి. రెండో ర‌కానికి చెందిన ప్రేమ‌క‌థే `జాను`. త‌మిళ చిత్రం `96`కి ఇది రీమేక్‌. నిజానికి క్లాసిక్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను రీమేక్ చేయాలంటే అంద‌రూ ఆలోచిస్తారు. కానీ దిల్‌రాజు క‌నెక్ట్ కావ‌డంతో వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా సినిమాను తెర‌కెక్కించ‌డానికి రెడీ అయిపోయాడు. అయితే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష పెర్ఫామెన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఆ పెర్ఫామెన్స్‌ల‌ను ఎవ‌రూ క్యారీ చేస్తారు అన‌గానే తెలుగుకి స‌మంత ఓకే.. కానీ హీరో విష‌యంలోనే అంద‌రి ఆస‌క్తి నెల‌కొంది. హీరోగా శ‌ర్వా ఓకే చెప్ప‌గానే తెలుగు ప‌రంగానూ బెస్ట్ క‌పుల్ తెర‌పైకి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని ప్రెజెంట్ చేయ‌డానికి వ‌చ్చారు. విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌ట‌న‌తో పోల్చి చూడ‌టం కంటే.. కేవ‌లం తెలుగు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసుకుంటే శ‌ర్వా రామ్‌గా.. జానుగా స‌మంత పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. మంచి ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. సినిమాలో కొన్ని సీన్స్ హార్ట్ ట‌చింగ్‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు హీరో, హీరోయిన్ చిన్న‌ప్పుడు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు వారు విడిపోయిన సంద‌ర్భాలు..వాటిని గుర్తుకు తెచ్చుకున్న‌ప్పుడు శ‌ర్వా, సామ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అలాగే హీరో త‌న ప్రేమ‌..త‌ను అంతే ..అనేలా చివ‌ర‌ల్లో ఇచ్చిన ముగింపు కూడా బావుంది. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ర‌ఘుబాబు, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జూనియ‌ర్ శర్వాగా న‌టించిన సాయికిర‌ణ్‌, జూనియ‌ర్ స‌మంత‌గా న‌టించిన గౌరి, వ‌ర్ష బొల్ల‌మ్మ అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇక ఈ సినిమాకు మ‌హేంద్ర‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ.. గోవింద్ వ‌సంత సంగీతం వెన్నుద‌న్నుగా నిలిచాయి. మ‌హేంద్ర‌న్ స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తే..గోవింద్ వ‌సంత సంద‌ర్భానుసారం వ‌చ్చే పాట‌ల్లోని సంగీతం, నేప‌థ్య సంగీగ‌తం సన్నివేశాల‌ను ఎన్‌హెన్స్ చేశాయి. ద‌ర్శ‌కుడు పి.ప్రేమ్‌కుమార్ చాలా మందికి ప‌దవ త‌ర‌గ‌తిలో ఉండే ప్రేమ‌లు స‌క్సెస్ కావు.. అలాంటి ప్రేమ‌క‌థ‌లు స‌క్సెస్ కాక‌పోతే ఎలా ఉంటాయి? అనే కొన్ని ఎలిమెంట్స్‌ను తీసుకుని...17 సంత్స‌రాల త‌ర్వాత అలాంటి ప్రేమికులు క‌లుసుకున్న‌ప్పుడు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అనే పాయింట్స్‌ను స‌న్నివేశాల పరంగా చ‌క్క‌గా ప్రెజెంట్ చేశాడు. ఫ‌స్టాఫ్ కాస్త కామెడీ ట‌చ్‌తో ల‌వ్ సాగితే సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించినా హీరో, హీరోయిన్స్ మ‌ధ్య‌నే సినిమాను న‌డప‌డం అనేది డేరింగ్ విష‌యం. కొన్ని స‌న్నివేశాలు క‌థ ప్ర‌కారం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్‌కు సుదూరంగా ఉన్నాయి. నెరేష‌న్ చాలా స్లోగా ఉన్నాయి. నేటి యువ‌త‌రం ఈ ప్రేమ‌క‌థ‌కు క‌నెక్ట్ అవుతుందో లేదో కానీ.. ముప్పై ఏళ్లు పైబ‌డ్డ వాళ్ల‌కు, ల‌వ్ బ్రేక్ అయిన వారికి ఈ సినిమా బాగానే క‌నెక్ట్ అవుతుంది.

చివ‌ర‌గా... `జాను`...నెమ్మ‌దిగా సాగే భావోద్వేగ ప్రేమ‌క‌థ‌

Read Jaanu Movie Review in English

Rating : 2.8 / 5.0