బ‌న్నికిది మ‌ర‌చిపోలేని రోజు

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

మార్చి 28, 2003.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు ఇది. ఎందుకంటే.. క‌థానాయ‌కుడిగా బ‌న్ని న‌టించిన తొలి చిత్రం  ‘గంగోత్రి’ అదే రోజున ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పేరుకి తొలి చిత్ర‌మైనా.. ఈ మ్యూజిక‌ల్‌ లవ్ స్టొరీలో త‌న‌ న‌ట‌న‌తో, న‌ర్త‌న‌తో ప్రేక్షకులకి చేరువ‌య్యారు బ‌న్నీ. ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా చ‌క్క‌గా న‌టించారు. కథానాయికగా అదితి అగర్వాల్‌కి కూడా పరిచయ చిత్రం ఇదే కావడం విశేషం.

అక్కడక్కడ వెంకటేష్ నటించిన ‘చంటి’ సినిమా తాలుకూ ఫ్లేవ‌ర్‌ కనిపించినా.. చక్కటి క‌థ‌నంతో, పాట‌ల‌తో ప్రేక్షకులను  సినిమాలో లీనం అయ్యేలా చేశారు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కిది వంద‌వ చిత్రం కావ‌డం విశేషం. ఈ చిత్రం తర్వాత ‘ఆర్య’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లో నటించి తొలి బ్రేక్ అందుకున్నారు బ‌న్ని.

ఆ త‌రువాత సినిమా సినిమాకి కథానుగుణంగా తనని తాను మార్చుకుంటూ అన‌తికాలంలోనే త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.  నేటితో క‌థానాయ‌కుడిగా 15 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకుంటున్న బ‌న్ని.. అతి త్వ‌ర‌లో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇందులో ఆయ‌న ఆర్మీ అధికారిగా క‌నిపించ‌నున్నారు.