ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడగింపు...

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలుకు సంబంధించిన గడువును మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) గడువును డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10వ తేదీ వరకూ పొడిగించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును 15 రోజుల పాటు పెంచింది. ఫిబ్రవరి 15 లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలును కల్పించింది. కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపు దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

కాగా.. అకౌంట్ల ఆడిట్‌ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని బుధవారం ఆదాయం పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 గానూ.. కంపెనీలకు జనవరి 31 గానూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. అలాగే, జీఎస్‌టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 28 వరకూ 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.