రామానాయుడు స్టూడియోపై ‘ఐ’టీ సోదాలు.. జంకుతున్న నిర్మాతలు!
- IndiaGlitz, [Wednesday,November 20 2019]
టాలీవుడ్ టాప్ స్టూడియో అయిన రామానాయుడు స్టూడియో, ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. స్టూడియో, ప్రొదక్షన్ హౌస్‌లోనే కాకుండా సురేష్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మొత్తం పది చోట్ల ఏకకాలంలో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టూడియో, ప్రొడక్షన్ ఆఫీసుల్లోని అకౌంట్ సెక్షన్‌లో పది మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు స్టూడియోకు సంబంధించిన సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అయితే.. ఆర్థిక లావాదేవీల గురించి సురేష్ బాబును ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్. అయితే సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాల ఐటీ రిటర్న్స్ చెల్లించారా..? లేదా..? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రముఖ నిర్మాత ఇంటిపైనే ఐటీ దాడులు జరుగుతుండటంతో.. ఇక మన పరిస్థితేంటి..? మనకు ఐటీ షాక్‌లు తప్పవని స్టూడియోలు అధినేతలు, ప్రొడక్షన్ హౌస్ పెద్దలు, ప్రముఖ నిర్మాతలు జంకుతున్నారట. అంతేకాదు.. టాలీవుడ్‌కు చెందిన హీరోలు, దర్మకనిర్మాతల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం వరకూ సోదాలు జరుగుతాయని అనంతరం అధికారులు మీడియా మీట్ నిర్వహించి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం.