IT Raids: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ దాడులు.. కార్యకర్తలు ఆందోళన
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలకు ఐటీ దాడులు కలవరం పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారనే భయంతో ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా.. తాజాగా మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలోని ఆయన నివాసంలో, హైదరాబాద్ సోమాజిగూడలోని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఆయన బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం 5గంటలకే ఐటీ అధికారులు వివేక్ నివాసాలు, కార్యాలయాలకు చేరుకొని సోదాలు చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి వివేక్‌కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూర్ నియోజకవర్గంలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించడంతో ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటిపై ఐటీ దాడులను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మంచిర్యాలలోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకుని తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మొన్నటివరకు బీజేపీలో ఉన్న వివేక్.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. దివంగత నేత వెంకటస్వామి కుమారుడైన వివేక్ 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మళ్లీ గులాబీ పార్టీలో వెళ్లారు. అయితే ఐదేళ్లుగా బీజేపీలో ఉన్నా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com