IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో రూ.40లక్షలు నగదు పట్టివేత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఐటీ అధికారుల దాడులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాజాగా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న రోహిత్ రెడ్డి నివాసంతో పాటు తాండూరులో ఉన్న ఆయన సోదరుడి నివాసంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో లెక్కల్లో లేని రూ.20లక్షలు.. సోదరుడి ఇంట్లో మరో రూ.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలోని పలు వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి పలు రికార్డును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు సమకూరుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐటీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే బీఆర్ఎస్ నేతల నివాసాల్లోనూ దాడులు జరడపం కలకలం రేపింది. అయితే కేంద్రంలోని బీజేపీ నేతలు ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుని తమను ఇబ్బంది పెడుతున్నాయని ఇరు పార్టీల నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments