Chandrayaan 3: నేడే చంద్రయాన్-3 ల్యాండింగ్.. ఊపిరిబిగబెట్టి చూస్తోన్న ప్రపంచం, భారత్‌లో ఉద్విగ్న వాతావరణం
Send us your feedback to audioarticles@vaarta.com
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంది. దాదాపు 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లిపై దిగేందుకు సిద్ధమైంది. ఇస్రోకు సమాంతరంగా రష్యా కూడా లూనా 25 ప్రయోగం చేపట్టగా.. అది చివరి క్షణాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచం చూపు చంద్రయాన్ 3పై పడింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అగ్రరాజ్యాలు సైతం నేటి వరకు జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించలేదు. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ విఫలం కావడంతో ఇస్రో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. చంద్రయాన్ 3 కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అదనపు సెన్సార్లు, ఇంజిన్లు ఇలా ప్రతి చోట దృష్టి పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ సాఫ్ట్ ల్యాండింగ్‌ను సాధించడం ఖాయమని చెబుతోంది.
దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించనున్న మోడీ :
మరోవైపు చంద్రయాన్ 3 కోసం భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు తమ విద్యార్ధుల కోసం ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలంటూ ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. అటు బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వర్చువల్‌గా చంద్రయాన్ 3 ల్యాండింగ్ క్షణాలను వీక్షించనున్నారు.
14 రోజుల పాటు చంద్రుడిపై అధ్యయనం :
ల్యాండింగ్ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు విక్రమ్ ల్యాండర్‌లోని అన్ని వ్యవస్థను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏవైనా అసాధారణ పరిస్ధితులు తలెత్తితే ల్యాండింగ్‌ను ఈ నెల 27కు వాయిదా వేస్తామని ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌లో కోలాహలం నెలకొంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగాక విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. అక్కడ 14 రోజుల పాటు వుండి జాబిల్లిపై పలు అధ్యయనాలు చేస్తుంది. ఎందుకంటే చంద్రుడిపై సూర్యరశ్మి వున్నంతసేపే విక్రమ్, ప్రగ్యాన్‌లోని వ్యవస్ధలు సక్రమంగా పనిచేస్తాయి. ఒక్కసారి సూర్యాస్తమయం అయ్యిందంటే చంద్రుడిపై మొత్తం అంధకారంగా మారుతుంది ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments