ISRO:ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు.. నేడే చంద్రయాన్ - 3 , సర్వం సిద్ధం చేసిన ఇస్రో
Send us your feedback to audioarticles@vaarta.com
అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. అదే చంద్రయాన్-3. నాలుగేళ్ల క్రితం చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో నాటి ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని డాక్టర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. వచ్చే నెలలో చంద్రయాన్ 3 రాకెట్ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.
చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ నేపథ్యంలో ఇస్రో జాగ్రత్తలు :
చంద్రయాన్ 2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో కుప్పకూలింది. ఈ అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఇస్రో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తినా ల్యాండర్ కిందకు దిగేలా కసరత్తు చేపట్టింది. చంద్రయాన్ 3ని భూమి చుట్టూ వున్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. దీనిని ట్రాన్స్‌ల్యూనార్ ఇంజెక్షన్స్ (టీఎల్ఈ)గా పేర్కొంటారు. తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించాక లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (ఎల్‌వోఐ) ప్రక్రియ జరుగుతుంది. అనంతరం చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో వున్న కక్ష్యలోకి దీనిని ప్రవేశపెడతారు.
చంద్రుడిపైనే ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో :
ఆగస్ట్ 23 కానీ 24న కానీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. ఇది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. తర్వాత ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండ్ అవుతుంది. చంద్రయాన్ 3లోని పరికరాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో లక్ష్యం.
చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ వ్యయం రూ.613 కోట్లు :
చంద్రయాన్ 3 బరువు 3,900 కిలోలు... ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,148 కిలోలు.. ల్యాండర్, రోవర్ 1752 కిలోలు.. ప్రాజెక్ట్ వ్యయం రూ.613 కోట్లు.. ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వ్యాసం 4 మీటర్లు.. లిఫ్టాఫ్ బరువు 640 టన్నులు. చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ అనంతరం శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com