లంకలో మారణహోమం మా పనే: ఐసిస్
- IndiaGlitz, [Tuesday,April 23 2019]
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే నాడు జరిగిన మారణహోమంలో మొత్తం 321 మంది తుదిశ్వాస విడవగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. అయితే ఇప్పటి వరకూ ఈ దారుణానికి ఎవరు పాల్పడి వుంటారని అనుకుంటున్న టైమ్‌లో ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఓ ప్రకటన చేసింది. ఈ వరుస బాంబు పేలుళ్లు మా పనేనని ఐసిస్ ప్రకటించింది. కాగా దాడులకు జరిగినప్పుడు ఇది కచ్చితంగా ఐసీస్ పనేనని శ్రీలంక అధికారులు అనుమానం వ్యక్తం చేసిన విషయం విదితమే. అయితే అధికారులు వ్యక్తం చేసిన అనుమానం అక్షరసత్యమైంది.
ఓ వైపు ప్రకటన.. మరోవైపు అనుమానం!
అయితే ఐసిస్ ఎక్కడ దాడులకు తెగపడినా.. ఈ చర్యకు పాల్పడింది తామేనని ప్రకటిస్తాయి.. కానీ ఈ ఘటన జరిగిన రెండ్రోజు తర్వాత ఐసిస్ తామే చేశామని చెప్పడం గమనార్హం.. ఈ ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
రివెంజ్ తీర్చుకోవడానికి..!
న్యూజిలాండ్ దేశంలోని క్రిస్టిచర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో గత నెలలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 40 మంది మరణించగా మరో 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే మసీదుపై దాడి చేసినందుకుగాను ప్రతీకారంగా తాము చర్చీతో పాటు పలు ప్రాంతాల్లో తాము పేలుళ్లకు పాల్పడినట్లు ఐసీస్ చెప్పుకొచ్చింది.
శ్రీలంకకు చెందిన 'ది నేషనల్ తవ్హీద్ జమౌత్', 'జమ్మియాతుల్ మిల్లతు ఇబ్రహీం' అనే ఉగ్రవాద సంస్థలు కారణమని అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. కాగా ఈ బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకూ 321 మంది ప్రజలు మరణించగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్నారు. మరోవైపు ప్రాణాలతో బయటపడిన జనాలు, పర్యాటకులు స్వదేశానికి వచ్చేందుకు యత్నిస్తున్నారు.