టీడీపీలో జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?

ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీలో కీలక నేత అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలోనే కూడా అచ్చెన్న విజయాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు. ఇక అసెంబ్లీలో ఆయన ఉన్నారంటే టీడీపీకి అతి పెద్ద అండ ఉన్నట్టే. అలాంటి అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ చేయించి టీడీపీని జగన్ పెద్ద దెబ్బే తీశారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇక నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అనే దానిపై ఏపీలో తెగ చర్చ జరుగుతోంది. మెజారిటీ వర్గం మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమ వైపే వేలెత్తి చూపిస్తోంది. కారణం పోలవరంలో అవినీతి జరిగిందని.. ఆ అవినీతిలో దేవినేని ఉమ భాగస్తులని ఆరోపణలు వినవచ్చాయి. దీనికి తోడు తాను అధికారంలోకి రాగానే పోలవరం అవినీతి అక్రమాలను బయటపెడతానిని జగన్ పలు సభల్లో వెల్లడించారు. అంతే కాకుండా ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ దేవినేని ఉమ ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ త్వరలోనే దేవినేని ఉమకు చెక్ పెడతారని ఏపీ ప్రజానీకం చర్చించుకుంటోంది.