Rama Jogaiah: చంద్రబాబుకు అధికారం అప్పగించడమే మీ లక్ష్యమా..? పవన్‌కు జోగయ్య ఘాటు లేఖ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి వచ్చాయి. తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు భేటీ అయి సీట్ల పంపకంపై సుదీర్ఘంగా చర్చించారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై ఓ అంచనాకు వచ్చారు. ఆ పార్టీ 25 సీట్లు కేటాయించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు.
జనసేనకు 30 సీట్లని ఒక ఎల్లో మీడియా, 27 సీట్లని మరో ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఎవరిని ఉద్ధరించడానికి ఈ రకమైన ఏకపక్ష వార్తలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. జనాభాలో 6 శాతం ఉన్న రెడ్లు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు మిగిలిన బలహీన వర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి. 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీలుగా గుర్తింపు పొందకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారు. వైసీపీని దింపాలంటే జనసేనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా టీడీపీతో కలిసి వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి" అని చెప్పారు.
"వైసీపీని అధికారం నుంచి తప్పించడం అంటే.. టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా. జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అనేది 2019 ఎన్నికల్లో తేలింది. ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందనేదే ప్రశ్న కావాలి. జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే.. ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కనీసం 50 సీట్లయినా దక్కించుకుంటేనే... రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా దక్కే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవిని మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడుతున్నట్టు ఎన్నికలకు ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా? అని జోగయ్య ప్రశ్నించారు.
కాగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం జరిగిందని.. జనసేనకు ఇచ్చే స్థానాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనసేనకు 25 సీట్లు, 30 సీట్లు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ నుంచి పోటీ చేయనున్నారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య లేఖ రాశారు. మరి జోగయ్య లేఖపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments