ఉండవల్లికి ఉన్న విలువ చంద్రబాబుకు లేదా..!?
- IndiaGlitz, [Wednesday,January 30 2019]
ఏపీలో మాజీ ఎంపీ ఉండవల్లికి ఉన్నంత విలువ.. సీఎం చంద్రబాబుకు లేదా..? అంటే అవుననే అంటున్నాయి కొన్ని ఏపీ ప్రాంతీయ పార్టీలు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అఖిలపక్షంతో ఉండవల్లి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు, మేథావులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జనసేన తరఫున పవన్ రాగా.. టీడీపీ నుంచి సోమిరెడ్డి, నక్కా ఆనందబాబు హాజరయ్యారు. అయితే ఇదే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్ని పార్టీల ఆఫీసులకు సమాచారం అందించారు. అయితే భేటీకి అటు వైసీపీ, కాంగ్రెస్, జనసేన దూరంగా ఉంటున్నాయని ప్రకటించాయి. అంటే అర్థమేంటి..? చంద్రబాబు మీద ఎవరికీ నమ్మకం లేదనా..? లేకుంటే అతినమ్మకమా..? అనేది తెలియరాలేదు.
బాబు ఆహ్వానాన్ని తిరస్కరించిన పవన్..
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో బాబు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయమని జనసేనాని చెప్పుకొచ్చారు. ఆ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు బాబుకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు కానీ బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా ఉందని పవన్ మండిపడ్డారు. ఈ సమావేశం ఎందుకో.. రాజకీయ లబ్ధి కోసమా? అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన చేతులు కలుపుతుంది కానీ మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని మా పార్టీ విశ్వసిస్తోందని చంద్రబాబుకు పవన్ బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ దూరం..
జనసేన ఆహ్వానాన్ని తిరస్కరించిన అనంతరం.. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లేఖ రాశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో హోదాపై పోరాటమంటూ హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటనను జంగా లేఖలో ప్రస్తావించారు.
అయితే బుధవారం జరగనున్న సమావేశానికి ఇంకెన్ని పార్టీలు వస్తాయ్..? అనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి చూస్తే బాబు అఖిలపక్ష సమావేశం ఫెయిలయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది వరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే బుధవారం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.