దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు గగనమేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
దుబ్బాక అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఇప్పుడిప్పుడే తెరపడుతోంది. తాజాగా టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో మిగిలిన పార్టీలు కూడా వెంటనే పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అయితే ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయినా మరణిస్తే.. ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యులను నిలబెడితే ప్రతిపక్షాలు సైతం మద్దతిచ్చేవి. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి ఉండే అవకాశం కనిపించట్లేదు. టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కారణంగా దుబ్బాకలో తమ సత్తా చాటేందుకు ప్రతిపక్షాలు కృషి చేస్తున్నాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఎట్టకేలకు ఖరారు అయ్యారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమ అభ్యర్థిని ప్రకటించారు. కాగా.. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధికి చివరిశ్వాస వరకు రామలింగారెడ్డి పని చేశారని తెలిపారు. రామలింగారెడ్డి తలపెట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు వారి కుటుంబానికి ఇవ్వడమే సమంజసమన్నారు. జిల్లా నాయకులను సంప్రదించి అభ్యర్ధిత్వం ఖరారు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తొలుత దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని నిలబెట్టాలని కేసీఆర్ యోచించారు. రామలింగా రెడ్డి, ముత్యంరెడ్డి కుటుంబాలపై అసంతృప్తి నేపథ్యంలో మధ్యేమార్గంగా కేసీఆర్ ఆయనను తెరపైకి తీసుకురావాలని భావించారు. వెంకట్రామిరెడ్డికి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. గతంలో హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించారు.
చాలా సందర్భాలలో ఈయన పనితీరును కేసీఆర్ ప్రశంసించారు. కష్టపడి పనిచేస్తారన్న పేరూ ఉంది. సీఎం నియోజకవర్గంలో కేసీఆర్ కు ఎక్కడా చెడ్డపేరు రాకుండా ఈయననే పథకాలు అందేలా వెంకట్రామిరెడ్డి చూసేవారు. అయితే వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటిస్తే సొంత పార్టీ నుంచే వ్యతిరకేత ఎదురవుతుందని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు... శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపేందుకు యత్నిస్తోందని సమాచారం. బీజేపీ అయితే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ రెండు పార్టీలు దుబ్బాక ఎన్నికను ప్రకటించిన నాటి నుంచే వ్యూహాలకు పదును పెట్టాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయానికి దుబ్బాక విజయం నాంది పలుకుతుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకను చేజిక్కుంటే ఆ పార్టీని గట్టి దెబ్బ కొట్టినట్టవుతుందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments