Sharmila:ఇదేనా మీ పాలన.. సీఎం జగన్కు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఘాటు లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఓసారి ఆ లేఖ సారాంశం పరిశీలిస్తే..
‘ఘనత వహించిన మీ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల బతుకులు దయనీయంగా మారాయి. జీవన ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి మీ పాలనలో ఎదురవుతోంది. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా 'ఉప ప్రణాళిక'ని మంట గలిపారు. మీరొచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలు, కార్యక్రమాలను నిర్దయగా, నిర్లక్ష్యంగా నిలిపివేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా.. దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. వాటిని నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. ప్రధానంగా వారికి రక్షణ లేదు. పైగా, ఇలా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లు, మోతుబర్లు, రౌడీ మూకలే! ఉన్నారు.
‘ఎక్కడ అవకాశం దొరికినా.. వేదికెక్కి ప్రసంగించినా 'నా ఎస్సీలు, నా ఎస్టీలు' అంటూనే వారిని వంచించారు. మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. దళితులపై చేసిన దాష్టీకాలకు, నేడు కోర్టులో శిక్షపడ్డా ఆయనను అందలం ఎక్కించాలని సిగ్గు, సంస్కారం వదిలేసినా మీ నాయకత్వానికే చెల్లుతుంది. ఇప్పుడు కూడా మీ పార్టీలోని దళిత నాయకులు, ఏరుదాటి తెప్పతగలేసే మీ బరితెగించిన వాలకాన్ని తట్టుకోలేక ఎలా బయటకు వస్తున్నారో వేరే చెప్పాలా ముఖ్యమంత్రిగారు!’
‘పేదలు పెత్తందార్లకు మధ్య క్లాస్ వార్’ అంటూనే కడు పేదలైన ఎస్సీ ఎస్టీలు కోలుకోలేని విధంగా మీరు దెబ్బతీశారు. ఇంత అన్యాయమా? అన్ని విధాలా అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు సత్వరం విముక్తి కలిగించండి! ‘కన్న తల్లే దయ్యమైతే తొట్టెల కట్టే స్థలం లేదన్న’ సామెత చందంగా.. ప్రభుత్వమే పగబట్టినట్టుండటం.. దళిత గిరిజన వర్గాల వంచనకు నిలువెత్తు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా, తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యల్ని తక్షణం చేపట్టండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఇదే మా డిమాండ్!’ అంటూ లేఖలో వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout