కేసీఆర్ వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా?: ఒవైసీ
- IndiaGlitz, [Wednesday,July 15 2020]
సీఎం కేసీఆర్ కనిపించడం లేదనే వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అసలు సీఎం ఎలా కనిపించకుండా పోతారని తిరిగి ప్రశ్నించారు. అలా అంటే ఆయన ప్రభుత్వాన్ని నడపడం లేదనే అర్థం వస్తుందన్నారు. సీఎం వచ్చి ఫీల్డ్‌లో నిలిచేందుకు ఇదేమైనా క్రికెట్ మ్యాచా? అని ప్రశ్నించారు. ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారని అసదుద్దీన్ తెలిపారు.
‘‘అది ఎలా సాధ్యం? ముఖ్యమంత్రి ఎలా తప్పిపోతారు? సీఎం కనిపించడం లేదంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఆయన కనిపించడం లేదంటే.. ప్రభుత్వాన్ని నడపడం లేదనే కదా అర్థం? అలాంటిదేమీ లేదు. ఆయనొక ముఖ్యమంత్రి. బ్యూరోక్రసీ, మంత్రులకు ఆయన టచ్‌లోనే ఉంటున్నారు. ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రజలు దీనిని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? సీఎం తప్పిపోయారని మీరెలా చెప్పగలరు? ఆయనేం తప్పిపోలేదు. నేను, కొందరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు సీఎంతో మాట్లాడామో చెప్పాలా? సీఎం, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కమిషనర్ అంతా ఉన్నారు. ఎవరూ ఎక్కడికీ పోలేదు. సీఎం వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా? ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు’’ అని అసదుద్దీన్ తెలిపారు.