ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?
- IndiaGlitz, [Saturday,July 11 2020]
కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. అంబులెన్స్ లేదంటే ఎస్కార్ట్ వాహనంలో ఖనన స్థలానికి తీసుకెళ్లాలి. కానీ అదేమీ లేకుండా అత్యంత నిర్లక్షంగా ఆటోలో తరలించిన ఘటేన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తెలిసిన వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో వెనుక పడేసి శ్మశాన వాటికకు తరలించారు.
ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. వారిద్దరూ కనీసం పీపీఈ కిట్లు కూడా ధరించి లేరు. కేవలం మాస్క్‌లు ధరించి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వాసుపత్రి వర్గాలు మాట్లాడుతూ.. నేడు ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించారని.. తమ వద్ద ఒక్కటే అంబులెన్స్ ఉందని.. అందువల్లే ఆ మృతదేహాన్ని ఆటోలో తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కనీసం తరలిస్తున్న వ్యక్తులకైనా పీపీఈ కిట్లు ఇవ్వకపోవడంతో పాటు ఒక అంబులెన్స్‌లో మూడు మృతదేహాలను తరలిస్తే వచ్చే నష్టమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.