వచ్చే ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్’ లేనట్లేనా?
- IndiaGlitz, [Wednesday,July 22 2020]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను పూణేలో చిత్రీకరించాలని అనుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు ఐదు నెలలుగా ఈ సినిమాతో పాటు దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే విధి విధానాలతో క్రమంగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. అయితే రాజమౌళి అండ్ టీమ్‌ను కరోనా భయం వీడట్లేదు. దీంతో రాజమౌళి పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట జక్కన్న.
సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం ప్రకారం అక్టోబర్ తర్వాతే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే కనుక జరిగితే మిగిలిన పావుశాతం చిత్రీకరణను రాజమౌళి పూర్తి చేయడాని నాలుగైదు నెలల సమయం తీసుకుంటాడు. మరో వైపు ఆరు నుండి తొమ్మిది నెలల పాటు గ్రాఫిక్స్‌కు సమయం తీసుకుంటారు. ఈ లెక్కన సినిమా పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుంది. దీంతో వచ్చే ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల ఉండకపోవచ్చునని టాక్. కొత్త షెడ్యూల్‌ను గండిపేటలోనే చిత్రీకరించబోతున్నారట. అందుకోసం రూ.18 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ను వేస్తున్నారట. టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు, భీమ్‌ఫర్ రామరాజు వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.