బ్రేకింగ్: మసూద్ అజర్ ఖతం హోగయా..!?
- IndiaGlitz, [Sunday,March 03 2019]
అవును మీరు వింటున్నది నిజమే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ ఖతం హోగయా..!? అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పెషావర్‌లోని పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది.!. ఈ విషయం అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. నెట్టింట్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. అయితే ఇది నిజమా..? అబద్ధమా..? అసలు ఆయన బతికున్నారా..? చచ్చిపోయారా..? అనే విషయంపై క్లారిటీ రాలేదు. ముఖ్యంగా పుల్వామా దాడి ఘటనకు ప్రతీకారంగా పాక్‌లోని బాలకోట్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం అజర్ చలీ చప్పుడూ ఎక్కడా కనిపించలేదు. దాడి జరిగింది జైషే మహ్మద్ ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరంపైనే అయినప్పటికీ ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ఘటన జరిగి మళ్లీ వారం రోజులు కావాస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో అసలు ఆయన ఏ స్థితిలో ఉన్నాడనేది అర్థం చేస్కోవచ్చు. అయితే ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారి ఆయన చచ్చిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో మరణించారనేదానికి బలం చేకూరినట్లైంది.
ఇదిలా ఉంటే.. మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అజర్ పూర్తి అనారోగ్యంతో ఉన్నాడని.. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రకటించిన విషయం విదితమే. దీంతో జైషే మహ్మద్ సంస్థ చీఫ్ తమ దేశంలోనే ఉన్నట్టు పాకిస్తాన్ అధికారికంగా అంగీకరించినట్టు అయింది. పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ అజర్ మార్చి 2వ తేదీన చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఉగ్రవాదులపై చిన్నపాటి చర్యలకు పాల్పడినట్లు తెలిసినా.. ముఖ్యంగా పాక్ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే చాలు మీడియా ముందుకు రాలేకపోయినా.. కనీసం వీడియో కూడా రిలీజ్ చేయకపోవడంతో ఇదే ఆయన చనిపోయాడన్నది నిజమేనని ఒప్పుకోక తప్పదు మరి.
మరోవైపు.. బాల్‌కోట్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో అజర్ అల్లుడితో పాటు 300 మంది ఉగ్రమూకలు మరణించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం ఈ ఘటనపై మాట్లాడేందుకు కూడా ఒక్కరంటే ఒక్క ఉగ్రవాది కూడా బతికిబట్టకట్లేదని అప్పట్లో వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. సో అటు అజర్ అల్లుడు.. ఇటు అజర్ ఇద్దరూ వారం రోజుల వ్యవధిలోనే చనిపోయారన్న మాట. అయితే ఈ వ్యవహారంపై పాక్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.