'మహా' పాలిటిక్స్ కమల్‌‌కు ముందే తెలుసా!

  • IndiaGlitz, [Wednesday,November 27 2019]

మహారాష్ట్ర రాజకీయాలు మినిట్ టూ మినిట్ మారిపోతున్నాయ్.. అసలు ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో..? ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందో..? ఎవరు ఎవరితో ఉంటారో.. ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇవన్నీ అటుంచితే ఒక వేళ ముందడుగేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సీఎంగా ఎన్నిరోజులు.. ఎన్ని గంటలు ఉంటారో అర్థం కాదు.. ఎవరి పీఠం దిగుతారో..? మళ్లీ ఆ పీఠాన్ని ఎవరెక్కుతారో ఏంటో..! క్రికెట్ మ్యాచ్‌ను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగింది. అయితే మంగళవారం మధ్యాహ్నంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అందుకే పాలిటిక్స్ నందు.. ‘మహా’ పాలిటిక్స్ వేరయా అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే మహా పాలిటిక్స్‌ ఇలా ఉంటాయ్ అని ఇప్పటికే సినిమాల్లో కూడా వచ్చేసింది. ఇదిగో ఇలా సీఎంలు అస్తమాను మారుతుంటారని.. ఎవరు సీఎం అనే విషయాన్ని పసిగట్టింది మరెవరో కాదు.. విలక్షణ నటుడు కమల్ హాసన్. ఇదంతా రియల్ కాదండోయ్.. రీల్‌లో మాత్రమే.

కమల్ ఇలా పసిగట్టాడు!

మహరాష్ట్ర రాజకీయాలను ఇదిగో ఫలానా విధంగా ఉంటాయంటూ అప్పుడెప్పుడో 39 ఏళ్ల క్రితమే కమల్ హాసన్ ఊహించారు. 1981లో కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇంటర్వ్యూ సీన్ చూస్తుంటే.. మహారాజకీయాలు గుర్తుకు వస్తాయ్.. దాంతో పాటు నవ్వు కూడా ఆగదు. ఈ ఇంటర్వ్యూలో.. ఇంటర్వ్యూయర్.. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..? అని కమల్‌ను ప్రశ్నిస్తాడు. ఇందుకు ఆయన బదులిస్తూ.. మొన్నా, నిన్నా, ఇవాళా అని అని కమల్ ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అప్పట్లో కూడా ఇలానే మహా పరిస్థితులున్నాయేమో.. అందుకే ఇలా అప్పట్లో డైరెక్టర్ వ్యంగ్యంగా డైలాగ్ చెప్పించి ఉంటారు.

ఇలా జరిగిపోయింది..!

అయితే ఈ డైలాగ్ అప్పట్లో ఏ మాత్రం పేలిందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు, రాజకీయాలపై ఆసక్తి ఉండేవారు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇదిగో.. మా అభిమాన హీరో.. మహా రాజకీయాలను మందుగానే ఊహించరంటూ కమల్ వీరాభిమానులు కొందరు కాలర్ ఎగరేస్తున్నారు. సో.. మొత్తానికి చూస్తే నాటి రీల్ వీడియోలో ఉన్నది ఉన్నట్లే నేడు రియల్‌ లైఫ్‌లో జరుగుతోందన్న మాట. కాగా.. ఇటీవలే మహా సీఎంగా ఫడ్నవిస్ హడావుడిగా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరిగ్గా 72 గంటలకే ప్రభుత్వం కుప్పకూలడం.. ఫడ్నవిస్ రాజీనామా చేయడం.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కలిసి రేపు అనగా గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఉద్ధవ్‌ను సీఎంగా కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నుకుంది. డిసెంబర్ 1న మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో ఉద్దవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.