Comedian Ali : అలీ - చిరంజీవిల తొలి సినిమా ఒకటే..  అసలేం జరిగిందంటే..?

అలీ ఈ పేరు వినగానే.. సొట్టబుగ్గల రూపం, ఎవరికీ అర్ధం కానీ భాషలో వింత శబ్ధాలతో చేసే కామెడీ గుర్తొస్తూ వుంటుంది. అక్కుం బక్కుం, కాట్రవల్లి, ఎందచాట, జలగండ్రి అనే పదాలు ఎవరికైనా టక్కున గుర్తొస్తూ వుంటాయి. అంతేనా మనోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఆ తెల్లోడు కూడా షాకై కళ్లు తిరిగి పడిపోతూ వుంటాడు. దశాబ్ధాలుగా తెలుగువారిని తన నవ్వులతో అలరిస్తున్నారు అలీ. ఎంతమంది కమెడియన్లు వచ్చినా అలీ మాత్రం ప్రత్యేకం. ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతోమంది ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ అలీ డేట్స్ ఇప్పటికీ వెతుక్కుంటూ వచ్చేవారు ఎందరో. ఇక బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ అలీ తెలుగు లొగిళ్లకు ఇంకా దగ్గరవుతున్నారు.

పసిప్రాయంలోనే ఇంటికి దూరమైన అలీ :

ఇదిలావుండగా.. అలీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమయ్యారు. సొంత గ్రామాన్ని వదిలిపెట్టి రాష్ట్రం కానీ రాష్ట్రంలో పరాయి మనుషుల మధ్య వుండాల్సి వచ్చింది. ఇటీవల ఓ తెలుగు వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పునాదిరాళ్లతోనే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అలీ:

అంతా అలీ తొలి సినిమా ఏదంటే సీతాకోక చిలుక అనుకుంటారు. అభిమానులే కాదు, సినీ ప్రముఖులది కూడా అదే అభిప్రాయం. కానీ ఇది ఆయనకు ఏడో సినిమా అట . అలీ తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘పునాది రాళ్లు’’ . దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అలీ పంచుకున్నారు. పునాది రాళ్లు నిర్మించిన వారు అలీ బంధువులేనట. ఓసారి రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వున్నప్పుడు.. వాళ్ల నాన్నగారు షూటింగ్ లోకేషన్‌కి తీసుకెళ్లారట. అప్పుడు అనుకోకుండా పునాదిరాళ్లులో నటించే అవకాశం వచ్చిందట. అంటే చిరంజీవితో పాటు అలీ కూడా ఒకే సంవత్సరం ఒకే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారన్న మాట.