అనుష్క 'నిశ్శబ్దం', 'ఉప్పెన' ఓటీటీలోనేనా ?
- IndiaGlitz, [Saturday,May 16 2020]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తెలుగు చిత్ర సీమలో అనుష్క ఓ సమాధానంగా కనపడుతుంది. ఇప్పటికే ఈమె నటించిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి చిత్రాలు మంచి ఆదరణను పొందాయి. అలాగే ఈమె ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్ 50 రోజులకు పైగా కొనసాగుతుండటంతో నిర్మాతలు ఓ మోస్తరు సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మరికొందరు వారి సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ లిస్టులో నిశ్శబ్దం సినిమా కూడా చేరనుందట.
నిజానికి ముందుగా నిశ్శబ్దం నిర్మాతలు తమ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని అనుకున్నారు. అధికారికంగానూ ప్రకటించారు. అయితే పరిస్థితులు మారతున్నాయి. కరోనా వల్ల లాక్డౌన్ కంటిన్యూ కావడం.. థియేటర్స్ తెరుచుకునే ఇంకా క్లారిటీ రాకపోవడంతో నిశ్శబ్దం నిర్మాతలు సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని వార్తలు వినపడుతున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రాన్ని కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కత పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు నటించారు.
ఓటీటీలో ‘ఉప్పెన’..?
మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోదరుడు. ఈ యువ హీరో తొలి చిత్రంగా ‘ఉప్పెన’ తెరకెక్కింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల ఆగిపోయింది. తదుపరి విడుదల తేదీపై క్లారిటీ లేదు. డిసెంబర్లో ఉప్పెన చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినపడ్డాయి.
కానీ తాజాగా సినీ వర్గాల్లో సమాచారం మరోలా వినపడుతుంది. ఈ సినిమాను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయడానికి ఓటీటీ సంస్థ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతుందట. ఇప్పటికే కొన్ని ప్రధాన చిత్రాల నిర్మాతలు వారి సినిమాల విడుదలకు సరైన థియేటర్స్ దొరికే అవకాశాలు లేకపోవడంతో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనే సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆ క్రమంలో ఉప్పెన నిర్మాతలు, ఓటీటీ ప్రతినిధుల మధ్య చర్చ జరుగుతుందట. అంతా సవ్యంగా ముగిస్తే ఉప్పెన చిత్రాన్ని కూడా ఓటీటీలో వీక్షించే అవకాశం ఉంది.