KCR:కేసీఆర్‌కు కోలుకోలేని షాక్‌లు.. వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు..

  • IndiaGlitz, [Friday,March 29 2024]

బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలందరూ కారు దిగిపోతున్నారు. దీంతో గులాబీ బాస్‌కు ఊపిరి సలపడం లేదు. నమ్మిన నేతలే కష్టకాలంలో తపపే వదిలి వెళ్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులు కారు దిగి కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయారు. తాజాగా కేసీఆర్(KCR) తర్వాత కీలక నేతలుగా ఉండే కే.కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'ఇటీవల మీడియాలో వస్తోన్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికొకరి మధ్య సహకారం కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తలు నన్ను మన్నించాలి' అని లేఖలో పేర్కొన్నారు.

కాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఏకంగా కేసీఆర్‌కు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీహరితో పాటు కావ్య కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు. మరోవైపు సీనియర్ నేత కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కాగా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కేశవరావు కలిసి పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ మారుతున్నదీ వివరించారు. అయితే కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనతంరం కేకే మీడియాతో మాట్లాడుతూ 'నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో.. కాంగ్రెస్‌లోనే చనిపోతాను' అని తెలిపారు. అటు అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువు అవుతుందని విజయలక్ష్మి కూడా వెల్లడించారు. వీరితో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

దీంతో కేసీఆర్‌కు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ బాస్‌కు కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలు పార్టీని వీడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు కవిత అరెస్ట్.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాల కేసులు, ఇంకోవైపు నేతల వలసలతో బీఆర్ఎస్ పార్టీ కకావికలమవుతోంది. మరి ఇన్ని ఇబ్బందులను అధిగమించి పార్టీని కాపాడుకుని తిరిగి గాడిన పెట్టడం కేసీఆర్ కుటుంబానికి కత్తి మీద సాము లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

Pratinidhi 2:'ఓటేయండి లేకపోతే చచ్చిపోండి'.. ఆకట్టుకుంటున్న 'ప్రతినిధి2' టీజర్..

నారా రోహిత్ చాలా కాలం తర్వాత తిరిగి హీరోగా నటించిన మూవీ 'ప్రతినిధి2'. 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీ 'ప్రతినిధి' సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

YS Jagan: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. ప్రజలకు సీఎం జగన్ పిలుపు..

చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుందన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలని సీఎం జగన్ తెలిపారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.86 శాతం ఓటింగ్‌

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక(Mahbubnagar local body MLC Election) పోలింగ్ పూర్తైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరిగింది.

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

Siddharth-Adithi Rao: పెళ్లి వార్తలపై స్పందించిన సిద్దార్థ్, అదితిరావు.. ఏమన్నారంటే..?

సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నారు. అందుకు తగ్గట్లే వీరిద్దరూ కలిసి విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు.